Stock Market: ప్రపంచ పరిణామాలే దిక్సూచి

15 Nov, 2021 06:25 IST|Sakshi

ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకం

నేడు డబ్ల్యూపీఐ డేటా విడుదల

మూడు ఐపీవోల లిస్టింగ్‌లు కూడా.., 

శుక్రవారం ఎక్స్చెంజీలకు సెలవు

అమ్మకాల ఒత్తిడి ఉండొచ్చు

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనా

ముంబై: ప్రపంచ పరిణామాలతో పాటు ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ తదితర అంశాల నుంచీ సంకేతాలను మార్కెట్‌ అందిపుచ్చుకోవచ్చని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం అనూహ్యరీతిలో పెరగడంతో ధరల కట్టడికి కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకోవచ్చు. బాండ్లపై రాబడులు పెరగవచ్చు. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులపై ప్రభావం చూపవ చ్చు. ఈ నేపథ్యంలో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

స్టాక్‌ సూచీలు నేడు (సోమవారం) ముందుగా గత వారాంతంలో విడుదలైన రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందించాల్సి ఉంది. ఈ రోజు విడుదల కానున్న టోకు ధరల ద్రవ్యోల్బణం డేటాపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. గురునానక్‌ జయంతి సందర్భంగా శుక్రవారం ఎక్స్చెంజీలకు సెలవు. కనుక ట్రేడింగ్‌ నాలుగురోజులే జరగనుంది.  గత వారంలో సెన్సెక్స్‌ 619 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే.  

‘‘పండుగలు, కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాల సీజన్‌ దాదాపు ముగిసింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌ స్థిరీకరణ(కన్సాలిడేషన్‌)కు అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ ఆందోళనలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగితే సూచీలు నష్టాన్ని చవిచూడవచ్చు’’ అని రిలిగేర్‌ బ్రోకరింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు.  

కొనసాగుతున్న అమ్మకాలు...  
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నవంబర్‌ ప్రథమార్థంలో రూ.4,694 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇందులో డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.3,745 కోట్లను, ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.949 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈక్విటీలు అధిక విలువ ట్రేడ్‌ అవుతున్నాయనే కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని మార్నింగ్‌స్టార్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు. 

మరిన్ని వార్తలు