బ్యాంకు డిపాజిట్లపై వచ్చేది నష్టమే!

13 Oct, 2021 12:22 IST|Sakshi

వడ్డీ రేటును మించిన ద్రవ్యోల్బణం 

దీంతో ఎఫ్‌డీలపై నష్టపోవాల్సిన పరిస్థితి 

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై మెరుగైన రేట్లు  

న్యూఢిల్లీ: బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేసిన వారు రాబడి లేకపోగా.. నికరంగా నష్టపోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రేటు.. స్వల్పకాల డిపాజిట్‌ రేట్లను మించిపోవడమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 5.3 శాతం స్థాయిలో ఉండొచ్చంటూ ఆర్‌బీఐ ఎంపీసీ గత వారం సమీక్ష సందర్భంగా అంచనా వేసింది. కానీ, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ఏడాది కాల ఎఫ్‌డీపై ఆఫర్‌ చేస్తున్న రేటు 5 శాతంగానే ఉంది. అంటే ఎస్‌బీఐలో ఏడాదికి డిపాజిట్‌ చేస్తే.. డిపాజిట్‌దారు నికరంగా 0.3 శాతం నష్టపోవాల్సి వస్తుందని అర్థమవుతోంది. ఈ ఏడాది ఆగస్ట్‌ నెలలోనూ రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.3 శాతంగానే ఉండడం గమనార్హం. రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు నుంచి డిపాజిట్‌ రేటును తీసివేయగా.. మిగిలిందే వాస్తవ రాబడి. కానీ, చాలా మంది రాబడి రేటును చూస్తారే కానీ, కరెన్సీ విలువను హరించే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోరు.  


మూడేళ్లకు డిపాజిట్‌ చేసినా అంతే.. 
ఏడాది లోపు ఎఫ్‌డీలపై ఎస్‌బీఐలో రేటు 4.40 శాతమే ఉండడం గమనార్హం. అంటే ఇక్కడ నికర నష్టం 0.90 శాతంగా తెలుస్తోంది. రెండు నుంచి మూడేళ్ల కాల డిపాజిట్లపై ఆఫర్‌ చేస్తున్న రేటు 5.10 శాతంగా ఉంది. అంటే ఇక్కడ డిపాజిట్‌దారులకు నికర నష్టం 0.20 శాతంగా ఉంది. మూడు నుంచి ఐదేళ్ల కాల డిపాజిట్‌లపై 5.30 శాతం రేటును ఆఫర్‌ చేస్తోంది. ఇక్కడ నష్టం లేదు, రాబడి కూడా లేదన్నట్టు అర్థం చేసుకోవాలి. ప్రైవేటు రంగంలోనే దిగ్గజ స్థానంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును చూసినా.. 1–2 ఏళ్ల డిపాజిట్‌లపై ఆఫర్‌ చేస్తున్న రేటు 4.90 శాతంగానే ఉంది. 2–3 ఏళ్ల డిపాజిట్‌లపై ఇదే బ్యాంకు 5.15 శాతం రేటును అమలు చేస్తోంది.  
చిన్న పొదుపు పథకాలు నయం..  
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే చిన్న మొత్తాల పొదుపు పథకాలు రాబడి విషయంలో ఎఫ్‌డీలతో పోలిస్తే ప్రస్తుతం కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాయి. 1–3 ఏళ్ల టైమ్‌ డిపాజిట్‌పై ప్రస్తుతం 5.5 శాతం రేటు అమల్లో ఉంది. ద్రవ్యోల్బణం కంటే 0.20 శాతం ఎక్కువ. అలాగే, ఐదేళ్ల టైమ్‌ డిపాజిట్‌పై 6.7 శాతం రేటు అమల్లో ఉంది. దీనిపై నిపుణుల అభిప్రాయాన్ని చూస్తే.. సంక్షోభానంతరం, ఆర్థిక వ్యవస్థలు ఎక్కువ ఉద్దీనపనలతో కోలుకుంటున్న సమయంలో రాబడులు ప్రతికూలంగా ఉండడం సాధారణమేనని అంటున్నారు. ‘‘ప్రస్తుతం సేవింగ్స్‌ డిపాజిట్‌పై బ్యాంకులు అందిస్తున్న సగటు రేటు 3.5 శాతంగానే ఉంది. ఏడాది కాల డిపాజిట్‌పై రేటు 5 శాతంతో పోలిస్తే ఇది మరీ తక్కువగా ఉంది. అంటే ద్రవ్యోల్బణ రేటును సర్దుబాటు చేసే రేటు కూడా లేదని అర్థమవుతోంది’’ అంటూ రీసర్జంట్‌ ఇండియా ఎండీ జ్యోతిప్రకాశ్‌ గడియా అన్నారు. బ్యాంకు డిపాజిట్లపై కనిష్ట రేట్లతో ప్రస్తుతం ప్రజలు ప్రత్యామ్నాయ సాధనాలైన మ్యూచువల్‌ ఫండ్స్, ఈక్విటీలవైపు చూస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. బ్యాంకు డిపాజిట్‌ రేట్లు గణనీయంగా పుంజుకునే వరకు.. రిస్క్‌ సాధనాల్లో (ఈక్విటీలు తదితర) వృద్ధి కొనసాగొచ్చని గడియా అభిప్రాయపడ్డారు.  

చదవండి:ఎకానమీలో వెలుగు రేఖలు

మరిన్ని వార్తలు