2022 జూన్‌ నుంచి రేట్ల పెంపు!

6 Aug, 2021 03:07 IST|Sakshi

యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనా

సరఫరా సమస్యలే ద్రవ్యోల్బణానికి కారణమన్న అభిప్రాయం

ధరల పెరుగుదల తప్పనిసరి ధోరణి కాదని విశ్లేషణ

న్యూఢిల్లీ: వినియోగ ధరల ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రస్తుత పెరుగుదల ధోరణి వ్యవస్థీకృతం (తీవ్రతను అడ్డుకోలేని వాస్తవ స్థితి) కాదని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా ఎకనమిస్ట్‌ తన్వీ గుప్తా జైన్‌ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం తీవ్రత సరఫరాల పరమైనదని, తాత్కాలికమైన ఈ సమస్య అదుపులోనికి (2–6 శ్రేణిలోకి) దిగివస్తుందని ఈ నివేదిక సూచించింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది మేనెల వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా కొనసాగే అవకాశం ఉందని, 2022 జూన్‌ నుంచీ రేట్లు పెరగవచ్చని నివేదిక పేర్కొంది. ఆర్‌బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష వివరాలు శుక్రవారం వెల్లడవనున్న నేపథ్యంలో యూబీఎస్‌ ఈ విశ్లేషణ చేయడం గమనార్హం.

నివేదికలో తన్వీ గుప్తా జైన్‌ పేర్కొన్న మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 2021–22లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 5.5 శాతంగా కొనసాగుతుంది. 2022–23లో 4.5 శాతంగా కొనసాగవచ్చు. దిగువస్థాయి వడ్డీరేట్ల వ్యవస్థ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించడం లేదు. వడ్డీరేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, గృహ పొదుపులు పెరిగాయి. మహమ్మారి ప్రేరిత అనిశ్చితి దీనికి ప్రధాన కారణం. తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వృద్ధికి, ఆదాయానికి, ఉపాధి కల్పనకు దోహపపడుతుంది. భారత జీడీపీ వృద్ధి అంచనాలను 2021–22 ఆర్థిక సంవత్సరానికి 1.5 శాతం తగ్గించి 10 శాతంగా యూబీఎస్‌ గత నెలలో ప్రకటించడం గమనార్హం. కార్మికుల భాగస్వామ్యం తగ్గడం, పట్టణ నిరుద్యోగిత 12 నెలల గరిష్టం 17.4 శాతానికి పెరగడం ప్రతికూల అంశాలుగా యూబీఎస్‌ పేర్కొంది.  అయితే క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొంది.  

మరిన్ని వార్తలు