భారత్‌లో తీవ్రంగా ధరల పెరుగుదల: మూడీస్‌

31 Mar, 2021 15:32 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ అనుబంధ విభాగం- మూడీస్‌ ఎనలిటిక్స్‌ విశ్లేషించింది. ఆసియా దేశాల ఎకానమీలతో పోల్చితే భారత్‌లోనే ధరల స్పీడ్‌ ఎక్కువగా ఉందని పేర్కొంది. వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణంపై ఇంధన ధరల ప్రభావం మున్ముందూ కొనసాగే అవకాశం ఉందని అంచనావేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీరేటు-రెపో (ప్రస్తుతం 4 శాతం) మరింత తగ్గకపోవచ్చని ఫైనాన్షియల్‌ ఇంటిలిజెన్స్‌ కంపెనీ అభిప్రాయపడింది. జనవరిలో 4.1 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. 

కోర్‌ ఇన్‌ఫ్లెషన్‌ (ఫుడ్, ఫ్యూయెల్, విద్యుత్‌ మినహా) ఇదే కాలంలో 5.3 శాతం నుంచి 5.6 శాతానికి ఎగసింది. ఆర్‌బీఐ రెపో నిర్ణయానికి రిటైల్‌ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం గమనార్హం. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్‌ పాయింట్లు(100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్‌ బ్యాంక్, గడచిన(2020 ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2021 నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో ‘ద్రవ్యోల్బణం భయాలతో’ యథాతథ రేటును కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంటుందని అంచనావేస్తున్న ఆర్‌బీఐ, భవిష్యత్తులో రేటు తగ్గింపునకే అవకాశం ఉందని సూచిస్తూ, వృద్ధికి దోహదపడే సరళతర ఆర్థిక విధానాలకే మొగ్గుచూపుతున్నట్లు ప్రకటిస్తూ వస్తోంది. కేంద్రం ఆర్‌బీఐకి ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్‌ ద్రవ్యోల్బణం 2-6 శాతం శ్రేణిలో ఉండాలి. ఏప్రిల్‌ 7న ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో మూడీస్‌ ఎనలిటిక్స్‌ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... 

  • పలు ఆసియా దేశాల్లో ద్రవ్యోల్బణం తగిన స్థాయిలోనే ఉంది. చమురు ధరల పెరుగుదల, దేశాల ఎకానమీలు తిరిగి ఊపందుకోవడం వంటి కారణాల వల్ల 2021లో కొంత పెరిగే అవకాశం ఉంది.
  • భారత్‌తో పాటు ఫిలిప్పైన్స్‌లో కూడా ద్రవ్యోల్బణం తగిన స్థాయికన్నా ఎక్కువగా ఉంది. విధాన నిర్ణేతలకు ఇది ఒక పెద్ద సవాలే.
  • 2020లో పలు నెలల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగిన ‘‘6 శాతం’’ స్థాయికన్నా ఎక్కువగా ఉంది. దీనివల్ల దేశంలో రెపో రేటు మరింత తగ్గించలేని పరిస్థితి నెలకొంది.
  • ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీకి ప్రస్తుతం కేంద్రం నిర్దేశిస్తున్న రిటైల్‌ ద్రవ్యోల్బణ శ్రేణి (2-6 శాతం) మార్చి 31వ తేదీ తర్వాతా కొనసాగించే అవకాశం ఉంది. ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకోవచ్చు.
  • ఎఫ్‌టీఐ (ఫ్లెక్సిబుల్‌ ఇన్‌ఫ్లెషన్‌ టార్గెట్‌) ఫ్రేమ్‌వర్క్‌ ఈ మేరకు మార్గదర్శకాలు చేస్తోంది.
  • 2016 నుంచీ అమల్లో ఉన్న ఈ మార్గదర్శకాల గడువు 2021 మార్చి 31వ తేదీతో తీరిపోనున్న సంగతి తెలిసిందే.

  చదవండి:

ఏప్రిల్‌లో ఎన్నిరోజులు బ్యాంక్‌లకు సెలవులంటే..!

పాన్-ఆధార్ లింకు స్టేటస్ చెక్ చేసుకోండిలా!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు