ఇన్ఫో ఎడ్జ్‌- డిక్సన్‌ టెక్నాలజీస్‌ భలే జోరు

8 Sep, 2020 12:52 IST|Sakshi

క్యూ1లో టర్న్‌ అరౌండ్‌ ఫలితాలు..

సరికొత్త గరిష్టానికి చేరువలో ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా

ఇకపై మెరుగైన పనితీరు చూపవచ్చన్న అంచనాలు

చరిత్రాత్మక గరిష్టాన్ని తాకిన డిక్సన్‌ టెక్నాలజీస్‌

హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 250 పాయింట్లు జంప్‌చేసి 38,667ను అధిగమించగా.. నిఫ్టీ 58 పాయింట్లు ఎగసి 11,413 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాలు ప్రకటించడంతో ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఇటీవల కొద్ది రోజులుగా జోరు చూపుతున్న డిక్సన్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఎలక్ట్రానిక్‌ ప్రొడక్టుల కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరర్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ షేరు సరికొత్త గరిష్టాన్ని తాకితే.. నౌకరీ.కామ్‌, జీవన్‌సాథీ, 99 ఏకర్స్‌.కామ్‌ ద్వారా సేవలందించే ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా రికార్డ్‌ గరిష్టానికి చేరువైంది. ఇతర వివరాలు చూద్దాం..

ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 94 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 191 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే నికర అమ్మకాలు మాత్రం 11 శాతం క్షీణించి రూ. 285 కోట్లను తాకాయి. ప్రస్తుతం రూ. 123 కోట్ల పన్నుకు ముందు లాభం సాధించగా.. గతంలో రూ. 150 కోట్ల నష్టం నమోదైంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 3,425ను తాకింది. ప్రస్తుతం 2.3 శాతం లాభంతో రూ. 3,369 వద్ద ట్రేడవుతోంది.  గత నెల 10న సాధించిన రికార్డ్‌ గరిష్టం రూ. 3,584కు ఇంట్రాడేలో చేరువకావడం గమనార్హం!

డిక్సన్‌ టెక్నాలజీస్‌
వరుసగా ఆరో రోజు డిక్సన్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ దూకుడు చూపుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 9,546 వద్ద ట్రేడవుతోంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత ఆరు రోజుల్లో 17 శాతం బలపడింది. ఈ ఏడాది మార్చి 24న రూ. 2,900 వద్ద కనిష్టాన్ని చవిచూసిన డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతోంది. వెరసి కనిష్టం నుంచి ఏకంగా 215 శాతం ర్యాలీ చేసింది.  దేశీ ఎలక్ట్రానిక్‌ మార్కెట్లో పలు విభాగాల్లో కంపెనీ కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ సర్వీసులను అందిస్తోంది. ఎంఎన్‌సీలు తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను తయారు చేస్తోంది. కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌, మొబైల్‌ ఫోన్లు, లెడ్‌ లైటింగ్‌ తదితర విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఈ ఏడాది క్యూ1లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ.. ఇకపై పనితీరు మెరుగుపడగలదన్న అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు