ఇన్ఫోసిస్‌ ధిక్కార స్వరం.. కేంద్రంతో చర్చలకు దూరం

28 Apr, 2022 19:41 IST|Sakshi

రాజీనామా చేసిన ఉద్యోగులు తమకు పోటీగా ఉన్న సంస్థల్లో ఏడాది పాటు ఉద్యోగం చేయకూడదంటూ ఇన్ఫోసిస్‌ విధించిన నిబంధన చినికి చినికి గాలివానగా మారుతోంది. ఈ వివాదంపై ఇటు ఉద్యోగ సంఘాలు, ఇన్ఫోసిస్‌ మేనేజ్‌మెంట్‌ వెవక్కి తగ్గడం లేదు. ఆఖరికి ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు, ఆ సంస్థ మధ్య తలెత్తిన విభేదాలు పరిష్కరించేందుకు 2022 ఏప్రిల్‌ 28న కేంద్ర కార్మిక శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్పోసిస్‌ గైర్హాజరవడంతో వివాదం మరింత బిగుసుకుంది.

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఐటీ ఎంప్లాయీ సెనేట్ (ఎన్‌ఐటీఈఎస్‌) కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో రాజీనామా చేసిన ఉద్యోగులు తిరిగి వేరే కంపెనీలో ఏడాది పాటు చేరకూడదనే నిబంధనపై చర్చించేందుకు కేంద్ర కార్మిక శాఖ ఇన్ఫోసిస్‌కు నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం 2022 ఏప్రిల్‌ 28న కార్మిక శాఖ, ఉద్యోగ సంఘాలు, ఇన్ఫోసిస్‌ యాజమాన్యం చర్చించాల్సి ఉంది. కానీ ఈ సమావేశానికి హాజరుకాలేమంటూ ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు తెలిపారు. దీంతో కనీసం జూమ్‌లో అయినా చర్చలో పాల్గొనాలని కోరగా దానికి కూడా ఇన్ఫోసిస్‌ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో మే 16న మరోసారి ఈ అంశంపై చర్చిద్దామంటూ కార్మిక శాఖ కొత్త తేదీని నిర్ణయించింది.

దేశంలోనే దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్‌ తాను తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు తమ సహాజ హక్కులను ఇన్ఫోసిస్‌ కాలరాస్తోందని ఉద్యోగులు అంటున్నారు. దీంతో ఈ వివాదం మరింతగా ముదురుతోంది. ఇన్ఫోసిస్‌ తరహాలోనే మరిన్ని కంపెనీలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కార్మికులు, ఉద్యోగుల రక్షణ మాటేమిటనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వాల జోక్యం పెరిగితే కార్పొరేట్‌ కంపెనీలు ఎలా స్పందిస్తాయనే అనుమానాలు పీకుతున్నాయి. దీంతో ఈ వివాదం తర్వాత ఏ మలుపు తీసుకుంటుందో చూడాలంటూ 2022 మే 16 వరకు ఆగాల్సిందే.

చదవండి: ఉద్యోగుల షాక్‌, ఇన్ఫోసిస్‌కు కేంద్రం నోటీసులు!

చదవండి: ఇన్ఫోసిస్‌ షాకింగ్‌ నిర్ణయం..కేంద్రం తలుపుతట్టిన ఐటీ ఉద్యోగులు..!

మరిన్ని వార్తలు