ఇన్ఫోసిస్‌ ఇదేం బాగాలేదు.. మళ్లీ మళ్లీ అదే పొరపాటా..

8 Jun, 2022 07:56 IST|Sakshi

ఐటీ పోర్టల్‌లో మళ్లీ సమస్యలు

సత్వరం సరిచేయాలని ఇన్ఫోసిస్‌కు కేంద్రం ఆదేశాలు 

న్యూఢిల్లీ: ట్యాక్స్‌ రిటర్న్‌లకు సంబంధించిన ఆదాయ పన్ను విభాగం  కొత్త పోర్టల్‌లో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. కొత్త వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చి మంగళవారానికి ఏడాది పూర్తయ్యింది. సరిగ్గా అదే సమయానికి మళ్లీ సమస్యలు తలెత్తడం గమనార్హం. పోర్టల్‌లోకి లాగిన్‌ కాలేకపోతున్నామని, సెర్చ్‌ ఆప్షన్‌ సరిగ్గా పని చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురై ఉంటుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో సమస్యలను సత్వరం పరిష్కరించాలంటూ పోర్టల్‌ను రూపొందించిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు సూచించినట్లు ఐటీ విభాగం పేర్కొంది.

హ్యాక్‌ కాలేదు
‘ఈ–ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో సెర్చ్‌ ఆప్షన్‌ పనితీరుకి సంబంధించిన సమస్యలు మా దృష్టికి వచ్చాయి. పరిష్కరించాలంటూ ఇన్ఫోసిస్‌కు సూచించాము. సమస్య సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు ఇన్ఫీ కూడా తెలిపింది‘ అని ఐటీ విభాగం మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేసింది. వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురికాలేదని, డేటా చౌర్యమేమీ జరగలేదని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ట్యాక్స్‌ పోర్టల్‌లో సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు.

సరిగ్గా ఏడాది
పన్ను రిటర్నుల ఫైలింగ్‌ను సులభతరం చేసే ఉద్దేశ్యంతో కొత్త పోర్టల్‌ను రూపొందించే కాంట్రాక్టును ఇన్ఫోసిస్‌ 2019లో దక్కించుకుంది. దీన్ని 2021 జూన్‌ 7న ఆవిష్కరించారు. కానీ అందుబాటులోకి వచ్చిన రోజు నుంచీ అనేక సందర్భాల్లో సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో ట్యాక్స్‌ రిటర్నుల దాఖలు గడువును కూడా ప్రభుత్వం పొడగించాల్సి వచ్చింది.

చదవండి: తగ్గేదేలే అంటున్న ఇన్ఫోసిస్‌.. ఏం జరగబోతోంది?

మరిన్ని వార్తలు