Income Tax Return: ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు

16 Sep, 2021 07:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నూతన ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలకు తెరపడలేదు. సెప్టెంబర్‌ 15 నాటికి సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటూ కేంద్రం ఇన్ఫోసిస్‌కు గడువు ఇచ్చింది. ఈ గడువు బుధవారంతో ముగిసింది. 

అయినా ఈ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ పలు సాంకేతిక అవాంతరాలు దర్శమనిస్తున్నట్టు పన్ను నిపుణులు చెబుతున్నారు. దాఖలు చైసిన రిటర్నులను సరిదిద్దుకోలేకపోవడం (రెక్టిఫికేషన్‌).. రిఫండ్‌ ఏ దశలో ఉందో తెలుకోలేకపోవడం, 2013–14 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి ముందు నాటి రిటర్నులను చూసే అవకాశం లేకపోవడం వీటిల్లో కొన్ని. ఈ ఏడాది జూన్‌ 7న కొత్త పోర్టల్‌ ప్రారంభమైంది. 

ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం తొలుత ఇన్ఫోసిస్‌ ఉన్నతాధికారులను కోరింది. అయినా అవి పరిష్కారం కాలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ ఆగస్ట్‌ 23న ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరీఖ్‌కు సమన్లు ఇచ్చింది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులతో ఇన్ఫోసిస్‌ సీఈవో ఆధ్వర్యంలోని బృందం సమావేశమైంది. అందులో సమస్యల పట్ల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా.. సెప్టెంబర్‌ 15 నాటికి అన్నింటినీ పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యల కారణంగా ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును ఈ ఏడాది డిసెంబర్‌ ఆఖరుకు కేంద్రం పొడిగించింది.  

మరిన్ని వార్తలు