ఇన్ఫీ లాభం రూ. 5,076 కోట్లు

15 Apr, 2021 05:02 IST|Sakshi

క్యూ4లో 17 శాతం ప్లస్‌

ఆదాయం 13 శాతం అప్‌

షేరుకి రూ. 1,750 ధరలో బైబ్యాక్‌

బైబ్యాక్‌ విలువ రూ.9,200 కోట్లు

రూ. 15 తుది డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ గతేడాది చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17.5 శాతం పెరిగి రూ. 5,076 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,321 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 13 శాతంపైగా ఎగసి రూ. 26,311 కోట్లకు చేరింది. గత క్యూ4లో రూ. 23,267 కోట్ల టర్నోవర్‌ సాధించింది.

డాలర్ల రూపేణా ఆదాయం 13 శాతం వృద్ధితో 361.3 కోట్ల డాలర్లుగా నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 15 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21)లో ఇన్ఫోసిస్‌ నికర లాభం 16.6 శాతం పురోగమించి రూ. 19,351 కోట్లకు చేరింది. ఇక మొత్తం ఆదాయం దాదాపు 11 శాతం పుంజుకుని రూ. 1,00,472 కోట్లను తాకింది. కాగా.. ఇప్పటికే చెల్లించిన రూ. 12తో కలిపి గతేడాదికి 54 శాతం అధికంగా రూ. 27 డివిడెండ్‌ను చెల్లించినట్లయ్యింది.   

బైబ్యాక్‌కు రెడీ
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుకి ఇన్ఫోసిస్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఒక్కో షేరుకీ రూ. 1,750 ధర మించకుండా 5.25 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు వెల్లడించింది. 1.23 శాతం వాటాకు సమానమైన వీటి కొనుగోలుకి రూ. 9,200 కోట్ల వరకూ వెచ్చించనుంది. ఫలితాలపై అంచనాల నేపథ్యంలో మంగళవారం ఇన్ఫోసిస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.6% క్షీణించి రూ. 1,403 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే బైబ్యాక్‌కు 25 శాతం ప్రీమియంను ప్రకటించడం గమనార్హం! ఇన్ఫీ అంతక్రితం 2019 ఆగస్ట్‌లో 11.05 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్‌ చేసింది. ఇందుకు రూ. 8,260 కోట్లు వెచ్చించింది. 2017 డిసెంబర్‌లో తొలిసారి షేరుకి రూ. 1,150 ధరలో బైబ్యాక్‌ను చేపట్టింది. తద్వారా 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది.   

గైడెన్స్‌ భేష్‌..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం 12–14 శాతం స్థాయిలో బలపడే వీలున్నట్లు ఇన్ఫోసిస్‌ తాజాగా అంచనా వేసింది. ఇది స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఇచ్చిన గైడెన్స్‌కాగా.. డివిడెండ్‌(రూ. 6,400 కోట్లు), బైబ్యాక్‌తో కలిపి వాటాదారులకు రూ. 15,600 కోట్లను తిరిగి చెల్లించనున్నట్లు తెలియజేసింది. తద్వారా వాటాదారులకు క్యాష్‌ఫ్లోలలో 85 శాతం వరకూ చెల్లించే విధానాలను పాటిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ వివరించారు.

ఆర్డర్‌ బుక్‌ రికార్డు
2020–21లో భారీ డీల్స్‌ ఆర్డర్ల విలువ 57 శాతం జంప్‌చేసి 14.1 బిలియన్‌ డాలర్లను తాకినట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. వీటిలో 66 శాతం డీల్స్‌ను కొత్తగా కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డిసెంబర్‌లో కొత్త రికార్డును నెలకొల్పుతూ దైమ్లర్‌ ఏజీ నుంచి 3.2 బిలియన్‌ డాలర్ల(అంచనా) ఆర్డర్‌ను పొందింది. గతేడాది ఆగస్ట్‌లో వ్యాన్‌గార్డ్‌ నుంచి సంపాదించిన 1.5 బిలియన్‌ డాలర్ల కాంట్రాక్టుతో పోలిస్తే ఇది రెట్టింపు విలువకావడం విశేషం! క్యూ4లో సైతం 2.1 బిలియన్‌ డాలర్ల కాంట్రాక్టులు కుదుర్చుకుంది.

25,000 మంది ఫ్రెషర్స్‌కు చాన్స్‌
గతేడాదిలో 36,500 మందిని  ఇన్ఫోసిస్‌ కొత్తగా నియమించు కుంది. వీరిలో క్యాంపస్‌ నియామకాల ద్వారా 21,000 మందికి ఉపాధి కల్పించినట్లు సీవోవో యూబీ ప్రవీణ్‌ రావు పేర్కొన్నారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25,000 మంది ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. వీరిలో 1,000 మందిని విదేశీ క్యాంపస్‌ల ద్వారా నియమించుకోనున్నట్లు వివరించారు. క్యూ3లో 10.1 శాతంగా నమోదైన ఉద్యోగ వలస రేటు క్యూ4లో  15.2 శాతానికి ఎగసింది. మార్చికల్లా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,59,619కు చేరింది.  

రూ. లక్ష కోట్లకు..
గతేడాది ఆదాయంలో రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాం. క్లయింట్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. కోబాల్ట్‌ టీఎం తదితర నైపుణ్యాల ద్వారా డిజిటల్‌ పోర్ట్‌ఫోలియోను పెంచుకుంటున్నాం. ఉద్యోగులకు అధికారాలు ఇవ్వడం ద్వారా గ్లోబల్‌ స్థాయిలో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. భాగస్వామి ఎంపికలో క్లయింట్ల నుంచి ప్రాధాన్యతను సాధిస్తున్నాం.
– ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ సలీల్‌ పరేఖ్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు