స్టార్టప్‌ల తీరు ‘పొంజి స్కీమ్‌’ మాదిరే!: నారాయణమూర్తి

3 Mar, 2023 03:55 IST|Sakshi

ముంబై: స్టార్టప్‌లు కేవలం ఆదాయం పెంపుపైనే దృష్టి సారిస్తూ, లాభాల గురించి ఆలోచించకుండా.. అదే సమయంలో వాటి మార్కెట్‌ విలువను పెంచుకోవడం అన్నది పొంజి స్కీమ్‌ మాదిరేనని, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి పేర్కొన్నారు. అటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందడంలో వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్, బోర్డు డైరెక్టర్ల పాత్రను తప్పుబట్టాలే కానీ, యువ పారిశ్రామికవేత్తలను కాదన్నారు. నాస్కామ్‌ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నారాయణమూర్తి మాట్లాడారు. దీర్ఘకాల ప్రయోజాల కోసం ఇన్ఫోసిస్‌ సైతం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. విషయాల పట్ల వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ పారదర్శకంగా, నిజాయితీగా మాట్లాడాలని కోరారు.

నిధులు సమీకరించినప్పుడల్లా వ్యాల్యూషన్లను పెంచుకుంటూ పోవడం ప్రమాదకరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా ఘటన వల్ల ఎదురుదెబ్బ లేదా ప్రతికూలతలు ఎదురైతే కంపెనీ ధర అదే మాదిరి పడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఐటీ కంపెనీలపై ఏ మేరకు ఉంటుందనే దానిపై మాట్లాడుతూ.. కష్ట సమయాలు ఎదురైనప్పుడల్లా భారత ఐటీ కంపెనీలు లాభపడినట్టు చెప్పారు. చాట్‌ జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్‌లతో భారత ఐటీ ఉద్యోగాలపై ప్రభావం ఉండదన్నారు. గతంలో తానూ ఈ తరహా ప్లాట్‌ఫామ్‌ల కోసం ప్రయత్నించినట్టు చెప్పారు. 

మరిన్ని వార్తలు