ఇన్ఫీకి సెప్టెంబర్‌ 15 డెడ్‌లైన్‌

24 Aug, 2021 02:14 IST|Sakshi

ఐటీ పోర్టల్‌ను సరిదిద్దడానికి గడువు నిర్దేశించిన కేంద్రం

న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్‌లో లోపాలన్నింటినీ సెప్టెంబర్‌ 15లోగా సరిదిద్దాలంటూ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ డెడ్‌లైన్‌ విధించారు. పోర్టల్‌ సమస్యలపై ఇన్ఫీ సీఈవో సలిల్‌ పరేఖ్, ఆయన బృందంతో మంత్రి సోమవారం భేటీ అయ్యారు. వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చి రెండున్నర నెలలు అవుతున్నా సాంకేతిక సమస్యలు వెన్నాడుతుండటంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

లోపాలను పరిష్కరించలేకపోతుండటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆదాయ పన్ను శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పోర్టల్‌ విషయంలో పన్ను చెల్లింపుదారులు, నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను సెప్టెంబర్‌ 15లోగా పరిష్కరించాలంటూ మంత్రి ఆదేశించారు‘ అని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై 750 మంది పైగా సిబ్బంది పనిచేస్తున్నారని, సీవోవో ప్రవీణ్‌ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని నిర్మలా సీతారామన్‌కు పరేఖ్‌  వివరించారు.  

ఈ అంశంపై ఇన్ఫీ అధికారులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం కావడం ఇది రెండోసారి. గతంలో జూన్‌ 22న పరేఖ్, ఇన్ఫీ సీవోవో ప్రవీణ్‌ రావులతో ఆమె భేటీ అయ్యారు. రిటర్నుల ప్రాసెసింగ్‌ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకి తగ్గించేందుకు, రిఫండ్‌ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త పోర్టల్‌ రూపొందించే కాంట్రాక్టును 2019లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ దక్కించుకుంది. ఈ పోర్టల్‌ జూన్‌ 7న అందుబాటులోకి వచ్చింది. అయితే, అప్పట్నుంచీ సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా రెండు రోజులపాటు నిర్వహణ పనుల కోసమంటూ సైట్‌ను ఇన్ఫీ నిలిపివేసింది.

మరిన్ని వార్తలు