బ్రిటన్‌ రాణిని దాటేసిన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి కుమార్తె..! 

9 Apr, 2022 17:16 IST|Sakshi

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో రష్యాలోని ఇన్ఫోసిస్‌ వ్యాపారాలపై బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌పై యూకే మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాకుండా రిషి సునక్‌ భార్య అక్షతా మూర్తి పన్ను చెల్లింపులపై కూడా వివాదం నెలకొంది. రిషి సునక్‌, అక్షతా మూర్తిని బ్రిటన్‌ మీడియా టార్గెట్‌ చేస్తూ పలు వ్యాసాలను ప్రచురించాయి. కాగా తాజాగా అక్షతామూర్తికి సంబంధించిన ఆస్తుల విషయంలో మరో విషయం బయటపడింది. 

ఎలిజబెత్‌ కంటే ఎక్కువ..!
అక్షతా మూర్తి ఆస్తులు బ్రిటన్ రాణి ఎలిజబెత్ కంటే ఎక్కువని తెలుస్తోంది. ఎఎఫ్‌పీ నివేదిక ప్రకారం, స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం...అక్షతా మూర్తి ఇన్ఫోసిస్‌లో దాదాపు బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కలిగి ఉంది. 2021 సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం... బ్రిటన్‌ మహరాణి వ్యక్తిగత సంపద దాదాపు  460 మిలియన్‌ డాలర్లుగా ఉందని నివేదించింది.

రిషి సునక్‌తో కలిసి స్థాపించిన వెంచర్ క్యాపిటల్ కంపెనీ కాటమరాన్ వెంచర్స్‌కి అక్షత డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా...డొమిసైల్ స్టేటస్ వల్ల ఆమె ఏటా 2.1 మిలియన్ పౌండ్ల పన్నులను తప్పించుకోగలిగారని బీబీసీ అంచనా వేసింది. అక్షతామూర్తి భారత పౌరురాలిగా ఉంటూ బ్రిటన్‌లో పన్నులను ఎగవేస్తున్నారని బ్రిటన్‌ ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ ఆరోపణలపై అక్షతా మూర్తి ప్రతినిధి వివరణ కూడా ఇచ్చారు.

చదవండి: యూకే మంత్రి రిషి సునక్‌ భార్య పన్ను చెల్లింపులపై వివాదం..! క్లారిటీ ఇచ్చిన అక్షతా మూర్తి..!

మరిన్ని వార్తలు