ఇన్ఫోసిస్‌.. జోష్‌

14 Jan, 2021 05:38 IST|Sakshi

క్యూ3లో నికర లాభం 17 శాతం అప్‌

7.13 బిలియన్‌ డాలర్ల డీల్స్‌తో రికార్డ్‌

కంపెనీ చేతికి ఆస్ట్రేలియన్‌ సంస్థ కార్టర్‌ డిజిటల్‌

2021–22లో 24,000 మంది ఫ్రెషర్స్‌కు చాన్స్‌

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం దాదాపు 17 శాతం పెరిగి రూ. 5,197 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లో మొత్తం ఆదాయం సైతం 12% పైగా పుంజుకుని రూ. 25,927 కోట్లకు చేరింది.  క్యూ3లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 7.13 బిలియన్‌ డాలర్ల విలువైన డీల్స్‌ను కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో స్థిరకరెన్సీ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి(2020–21) ఆదాయం 4.5–5% స్థాయిలో వృద్ధి చెందే వీలున్నట్లు తాజా అంచనాలు(గైడెన్స్‌) ప్రకటించింది. వెరసి ఇంతక్రితం వేసిన 2–3% ఆదాయ అంచనాలను ఎగువముఖంగా సవరించింది.

అత్యుత్తమ పనితీరు
కంపెనీ మరోసారి అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ సలీల్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. క్లయింట్లకు అవసరమైన వ్యూహాలను అమలుచేయడం, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా కంపెనీ వేగవంత వృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. దీంతో క్యూ3లో ఐటీ పరిశ్రమలోనే రికార్డ్‌ స్థాయిలో డీల్స్‌ కుదుర్చుకోగలిగినట్లు అభిప్రాయపడ్డారు. గత తొమ్మిది నెలల్లో కంపెనీ మొత్తం 12 బిలియన్‌ డాలర్ల విలువైన డీల్స్‌ను సాధించినట్లు తెలియజేశారు. వీటిలో 8 బిలియన్‌ డాలర్ల కాంట్రాక్టులను కొత్తగా కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. తద్వారా కంపెనీ పటిష్ట వృద్ధి బాటలో సాగుతున్నట్లు తెలియజేశారు. వేన్‌గార్డ్, దైల్మర్, రోల్స్‌రాయిస్‌ తదితర దిగ్గజాలతో కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు ద్వారా డిజిటల్, క్లౌడ్‌ విభాగాలలో కంపెనీకున్న పట్టు ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొన్నారు.  

2.49 లక్షల మంది
2020 డిసెంబర్‌కల్లా ఇన్ఫోసిస్‌ సిబ్బంది సంఖ్య 2.49 లక్షలకుపైగా చేరింది. కోవిడ్‌–19 కాలంలో 97 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే బాధ్యతలు నిర్వహించినట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ఈ ఏడాది 17,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనుండగా.. వచ్చే ఏడాది(2021–22) మరో 24,000 క్యాంపస్‌ ఉద్యోగాలకు వీలున్నట్లు తెలియజేసింది.  
సీఈవో సలీల్‌కు రూ. 3.25 కోట్ల విలువైన కంపెనీ రెస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్స్‌(ఆర్‌ఎస్‌యూ) జారీకి కంపెనీ రెమ్యునరేషన్‌ కమిటీ చేసిన ప్రతిపాదనను బోర్డు అనుమతించినట్లు ఇన్ఫోసిస్‌ పేర్కొంది. కాగా.. స్వతంత్ర డైరెక్టర్‌ పునీత కుమార్‌ సిన్హా పదవీ కాలం పూర్తికావడంతో జనవరి 13న పదవీ విరమణ చేసినట్లు వెల్లడించింది.

కార్టర్‌ డిజిటల్‌
ఆస్ట్రేలియన్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్‌ సంస్థ కార్టర్‌ డిజిటల్‌ను కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్‌ తాజాగా వెల్లడించింది. కంపెనీ ఆస్తులు, ఉద్యోగులను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. తద్వారా కంపెనీ గ్లోబల్‌ డిజైన్, ఎక్స్‌పీరియన్స్‌ సేవలలో మరింత పటిష్టంకానున్నట్లు పేర్కొంది. గ్లోబల్‌ డిజిటల్‌ సొల్యూషన్స్‌లో మరింత విస్తరించనున్నట్లు వివరించింది. ఆస్ట్రేలియన్‌ మార్కెట్లో కంపెనీ బ్రాండు వాంగ్‌డూడీ ద్వారా మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు చిక్కనున్నట్లు పేర్కొంది. మార్చిలోగా కొనుగోలు పూర్తికావచ్చని అంచనా వేసింది. డిజిటల్‌ కామర్స్‌ విభాగంలో సీఎంవోలు, బిజినెస్‌లకు కార్టర్‌ కొనుగోలుతో వాంగ్‌డూడీ సేవలు మరింత బలపడనున్నట్లు అభిప్రాయపడింది.

కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేరు బీఎస్‌ఈలో 1.2 శాతం బలపడి రూ.1,388 సమీపంలో ముగిసింది.

మరిన్ని వార్తలు