ఆర్థికమంత్రి హెచ్చరికలు.. ఒత్తిడిలో ఇ‍న్ఫోసిస్‌.. నేడు ఆఖరు!

15 Sep, 2021 14:40 IST|Sakshi

Infosys-Income Tax Portal: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్‌కంట్యాక్స్‌ పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఇన్ఫోసిస్‌కి కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయి. సామాన్య ట్యాక్స్‌ పేయర్ల నుంచి ఆర్థిక మంత్రి వరకు ప్రతీ ఒక్కరు పోర్టల్‌లో ఇబ్బందులపై ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇన్ఫోసిస్‌పై ఒత్తిడి పెరిగింది.

నేడే ఆఖరు
ఆన్‌లైన్‌లో ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లింపులు చేయవచ్చంటూ కేంద్రం గొప్పగా ప్రకటించింది. అందుకు తగ్గట్టే పోర్టల్‌ని 2021 జూన్‌ 7న  ప్రారంభించింది. అయితే తొలి రోజు నుంచే ఇ ఫైలింగ్‌ పోర్టల్‌ ద్వారా పన్ను చెల్లింపులు చేయడం కత్తి మీద సాములా మారింది. చీటికి మాటికి సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామటూ ఆర్థిక మంత్రి పలు మార్లు ప్రకటించారు. కానీ రెండు నెలలు గడిచినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆగస్టు 19న ఇన్పోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ని ఢిల్లీకి పిలిపించారు మంత్రి నిర్మలా సీతారామన్‌. సెప్టెంబరు 15వ తేదీలోగా ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలంటూ గట్టిగా చెప్పారు.

750 మంది నిపుణులు
ఐటీ పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు 750 మంది నిపుణులు మూడు వారాలుగా అహర్నిషలు పని చేస్తున్నారు. ఇన్ఫోసిస్‌ సీనియర్‌ అధికారి ప్రవీణ్‌రావు దగ్గకరుండి ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబరు 15తో అయినా ఐటీ పోర్టల్‌లో సమస్యలు పరిష్కారం అవుతాయా ? లేద మరోసారి పాత కథనే పునరావృతం అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సాంకేతిక లోపాలు తరచుగా రావడం, అది దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడం ఇన్ఫోసిస్‌కి ఇబ్బందిగా మారింది. 

2019లో ప్రారంభం
గతంలో ఆధార్‌ కార్డుకు సంబంధించిన టెక్నికల్ వర్క్‌ ఇన్ఫోసిస్‌ ఆధ్వర్యంలోనే జరిగింది. దీంతో ఇ ఫైలింగ్‌ పోర్టల్‌ రూపొందించే బాధ్యతలను కేంద్రం ఇన్ఫోసిస్‌కి 2019లో అప్పగించింది. ప్రస్తుతం ఇ ఫైలింగ్‌ పోర్టల్‌లో చాలా సమస్యలు కొలిక్కి వచ్చాయని ఇన్ఫోసిస్‌ అంటోంది.

చదవండి: ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు

మరిన్ని వార్తలు