తగ్గేదేలే అంటున్న ఇన్ఫోసిస్‌.. ఏం జరగబోతోంది?

4 Jun, 2022 20:25 IST|Sakshi

నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌ వివాదంపై ఇన్ఫోసిస్‌ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇన్ఫోసిస్‌ కొత్తగా అమల్లోకి తెచ్చిన నాన్‌ కాపింట్‌ అగ్రిమెంట్‌ సరికాదంటూ ఇప్పటికే నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయిస్‌ సెనేట్‌ (నాసెంట్‌) కార్మికశాఖను ఆశ్రయించింది. దీనిపై కార్మిక శాఖకు ఇన్ఫోసిస్‌ తరఫున హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంతోష్‌ కే నారాయణ్‌ రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు జాతీయ మీడియాలో ప్రచురితం అయ్యాయి. 

ఇది చాలా కామన్‌
కార్మిక శాఖకు ఇన్ఫోసిస్‌ తెలిపిన వివరాల ప్రకారం... తమ సంస్థలో రాజీనామా చేసిన ఉద్యోగి పోటీ సంస్థల్లో ఏడాది పాటు ఉద్యోగంలో చేరకూడదనే నిబంధన కొత్తదేమీ కాదని ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఈ నిబంధనను ‘కామన్‌ అండ్‌ స్టాండర్డ్‌ బిజినెస్‌ ప్రాక్టీస్‌’గా ఆ సంస్థ పేర్కొంది. ఇన్ఫోసిస్‌ వంటి సంస్థలు చాలా పెద్ద పెద్ద కంపెనీలకు సర్వీసులు అందిస్తుంటాయి. ఈ సందర్భంగా ఆయా కంపెనీలకు చెందిన రహస్య సమాచారం ఇన్ఫోసిస్‌కు అందుతుంది. సేవలు అందించే క్రమంలో ఈ సున్నితమైన, రహస్య సమాచారాన్ని ఉద్యోగులతో కూడా షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ఫోసిస్‌ తెలిపింది.

అంత ముప్పేమీ లేదు
తమ క్లంయింట్లకు సంబంధించిన సున్నిత, రహస్య సమాచారం తెలుసుకున్న ఉద్యోగులు పోటీ కంపెనీలో చేరినప్పుడు విలువైన సమాచారాన్ని ఇతరులకు చేరవేసే ప్రమాదం ఉంటుందని ఇన్ఫోసిస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. తమ క్లంయిట్ల శ్రేయస్సు, నాణ్యమైన సేవలు అందివ్వడంలో భాగంగానే నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌ను అమల్లోకి తెచ్చినట్టు ఇన్ఫోసిస్‌ తెలిపింది. పోటీ కంపెనీల్లో పని చేయకూడదనే నిబంధన కొంత కాలానికే పరిమితం అయినందున ఉద్యోగుల భవిష్యత్తుకు వచ్చే పెను ప్రమాదమేమీ ఉండబోదని అభిప్రాయపడింది.  

పరిష్కారం ఎలా?
నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌పై ఇన్ఫోసిస్‌ నుంచి అందిన సమాచారంపై ఇంకా కార్మిఖ శాఖ (పూణే) ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. ఇన్ఫోసిస్‌ తెలిపిన అభిప్రాయాలు, నాసెంట్‌ ప్రతినిధులు వెలిబుచ్చిన ఆందోళనల పట్ల నిపుణులతో చర్చలు జరుపుతోంది. ఇటు ఉద్యోగులు అటు కార్పోరేట్‌ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే పనిలో ఉంది. త్వరలోనే ఈ నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌పై కార్మిక శాఖ తన వైఖరి ఏంటో చెప్పనుంది. 

చదవండి: నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌.. ముచ్చటగా మూడోసారి

మరిన్ని వార్తలు