ఐనాక్స్‌ లీజర్‌ నష్టాలు తగ్గాయ్‌

20 Oct, 2022 08:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మల్టీప్లెక్స్‌ చైన్‌ నిర్వాహక కంపెనీ ఐనాక్స్‌ లీజర్‌ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర నష్టం సగానికిపైగా తగ్గి రూ. 40.4 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 88 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 47.44 కోట్ల నుంచి రూ. 374 కోట్లకు దూసుకెళ్లింది.

కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ కారణంగా గత క్యూ2లో స్వల్ప టర్నోవర్‌ నమోదైంది. అయితే ప్రస్తుత క్యూ2లో మొత్తం వ్యయాలు సైతం రెండు రెట్లు ఎగసి రూ. 434 కోట్లను దాటాయి. ఈ కాలంలో 11.6 మిలియన్లమంది సినిమాలను వీక్షించగా.. సగటు టికెట్‌ ధర రూ. 215కు చేరింది. ఒక్కో వ్యక్తి సగటు వ్యయం రికార్డు నెలకొల్పుతూ రూ. 102ను తాకింది. కొత్తగా 13 తెరలను ఏర్పాటు చేసింది. దీంతో కంపెనీ 165 మల్టీప్లెక్స్‌ల ద్వారా 74 పట్టణాలలో 705 స్క్రీన్లను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో ఐనాక్స్‌ లీజర్‌ షేరు బీఎస్‌ఈలో 0.6 శాతం బలపడి రూ. 514 వద్ద ముగిసింది. 

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: ఊహించని షాక్‌.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!

మరిన్ని వార్తలు