ఐనాక్స్‌ విండ్‌ రుణరహితం

7 Sep, 2022 04:05 IST|Sakshi

ఐపీవో తదుపరి ప్రణాళికలు

ముంబై: పబ్లిక్‌ ఇష్యూ తదుపరి రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పవన విద్యుత్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఐనాక్స్‌ విండ్‌ తాజాగా పేర్కొంది. ఐపీవో చేపట్టేందుకు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన కంపెనీ అనుమతుల కోసం చూస్తోంది. ప్రమోటర్లు కంపెనీకి పెట్టుబడులు అందించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు.. ఐపీవో నిధులను వెచ్చించడం ద్వారా రుణరహితంగా మారనున్నట్లు వివరించింది. ప్రాస్పెక్టస్‌ ప్రకారం కంపెనీకి 2022  జూన్‌కల్లా రూ. 1,718 కోట్ల స్థూల రుణ భారం నమోదైంది.

రూ. 222 కోట్లమేర నగదు నిల్వలున్నాయి. నికరంగా రూ. 1,495 కోట్ల రుణాలను కలిగి ఉంది. అయితే ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌కింద రెండు ప్రమోటర్‌ సంస్థలు మార్పిడిరహిత బాండ్ల ద్వారా రూ. 800 కోట్లను కంపెనీకి అందించనున్నట్లు ఐనాక్స్‌ విండ్‌ తెలియజేసింది. ఐనాక్స్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ రూ. 600 కోట్లు, ఐనాక్స్‌ విండ్‌ ఎనర్జీ రూ. 200 కోట్లు చొప్పున పంప్‌చేయనున్నాయి. వీటితోపాటు ఐపీవో నిధులను సైతం రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ఐనాక్స్‌ విండ్‌ వివరించింది. తద్వారా ఐపీవో తదుపరి రుణరహిత కంపెనీగా ఆవిర్భవించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేసింది.

మరిన్ని వార్తలు