వ్యక్తిగత హామీదార్లూ బాధ్యులే..!

22 May, 2021 05:00 IST|Sakshi

ఐబీసీ ప్రొసీడింగ్స్‌పై సుప్రీం కీలక రూలింగ్‌

మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో మరో ముందడుగు

న్యూఢిల్లీ: కంపెనీలకు రుణాల విషయంలో ఆయా సంస్థలతో పాటు వ్యక్తిగత గ్యారంటార్ల (హామీగా ఉన్నవారు)పైనా ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టీ కోడ్‌ (ఐబీసీ) ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం  సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఖాయిలా కంపెనీల పునరుద్ధరణ ప్రణాళికలకు ఆమోదముద్ర పడినప్పటికీ, ఐబీసీ నిబంధనావళి కింద చర్యల నుంచి హామీదారులు తప్పించుకోలేరని జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, ఆర్‌. రవీంద్రలతో కూడిన ధర్మాసనం తన 82 పేజీల ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.   

బడాపారిశ్రామికవేత్తలపై పిడుగు..
తాజా ఉత్తర్వులతో ఇందుకు సంబంధించి కేంద్రం 2019 నవంబర్‌ 15న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీం తీర్పు సమర్థించినట్లయ్యింది. అలాగే బడా కార్పొరేట్ల రుణాల విషయంలో ఉన్నత స్థాయి పారిశ్రామికవేత్తలు దివాలా చర్యలను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. రిలయన్స్‌ గ్రూప్‌ చీఫ్‌ అనిల్‌ అంబానీ, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు కార్పొరేషన్‌ అధిపతి కపిల్‌ వాధ్వాన్, భూషన్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ హెడ్‌ సంజయ్‌ సింఘాల్‌ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఆయా పారిశ్రామికవేత్తలపై రుణ గ్రహీతలు దాఖలు చేసిన కేసులు, అప్పిలేట్‌ స్థాయిలో ఆయా ఉన్నత స్థాయి కోర్టుల్లో ‘స్టే’లో ఉన్నాయి. కంపెనీలతో పాటు గ్యారంటార్లమీదా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్స్‌ (ఎన్‌సీఎల్‌టీ)ల్లో ఒకేసారి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌ ప్రారంభించడానికి కూడా అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఇలాంటి ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన దాదాపు 75 రిట్‌ పిటిషన్లు, ట్రాన్‌ఫర్డ్‌ కేసులు, ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్లు అన్నింటినీ తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం  స్పష్టం చేసింది.  కేంద్రం 2019 నవంబర్‌ 15న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలుచేస్తూ, పారిశ్రామికవేత్త లలిత్‌ కుమార్‌ జైన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధానంగా తీసుకుని సుప్రీం కోర్టు తాజా రూలింగ్‌ ఇచ్చింది. 

మరిన్ని వార్తలు