Facebook Outage: రెండుగంటలు ఆగిన ఇన్‌స్టాగ్రామ్‌, మెసేంజర్‌.. క్షమాపణలు చెప్పిన ఎఫ్‌బీ

9 Oct, 2021 07:28 IST|Sakshi

Instadown Trend Amid Instagram Down Again: ఫేస్‌బుక్‌ సర్వీసులకు మరోసారి విఘాతం కలిగింది. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సుమారు రెండు గంటలసేపు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు మరోసారి అసహనానికి గురయ్యారు. 

ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ రిఫ్రెష్‌ కాకపోవడం, ఫీడ్స్‌ ఆగిపోవడం, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ పని చేయకపోవడంతో పాటు ఫేస్‌బుక్‌ కార్యాలయంలోనూ పలు సేవలు ఆగిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ అంతరాయంపై యూజర్లకు ఫేస్‌బుక్‌ క్షమాపణలు చెప్పింది. ఇంకోవైపు Instagram Down, #Instadown హ్యాష్‌ట్యాగులు విపరీతంగా షేర్‌ కావడంతో ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి.

ఫేస్‌బుక్‌ సంబంధిత సేవలకు అంతరాయం ఏర్పడడం ఈ వారంలో ఇది రెండోసారి. సోమవారం రాత్రి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు సుమారు ఆరేడు గంటలు ఆగిపోవడంతో కోట్ల మంది యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. ట్విటర్‌, టెలిగ్రామ్‌ సర్వీసుల వైపు మళ్లారు. ఈ అంతరాయం ఫలితంగా ఫేస్‌బుక్‌తో పాటు చిరువ్యాపారస్తులు కూడా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. 


ఇక శుక్రవారం రాత్రి ఏర్పడిన అంతరాయానికి, సోమవారం ఏర్పడిన అంతరాయానికి ఒకే కారణం కాదని ప్రకటించిన ఫేస్‌బుక్‌.. అంతరాయానికి కారణం ఏంటన్నది మాత్రం చెప్పట్లేదు. అయితే సమస్యను పరిష్కరించినట్లు, ఇప్పుడంతా సర్దుకుందని మాత్రం ప్రకటించింది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఓపికగా ఎదురుచూసినందుకు యూజర్లకు కృతజ్ఞతలు తెలియజేసింది. 


మరోవైపు ఒకేవారంలో రెండుసార్లు షట్‌డౌన్‌ కావడంపై యూజర్లు అసహనంతో పాటు సెటైర్లు పేల్చారు. శుక్రవారం రాత్రి ఆ రెండుగంటలపాటు ట్విటర్‌లో మీమ్స్‌తో ఫేస్‌బుక్‌ మీద విరుచుకుపడ్డారు. అందులో కొన్ని మీకోసం..

చదవండి: ఆరు గంటల్లో 50 వేల కోట్ల నష్టం.. జుకర్‌బర్గ్‌ను ముంచిన ఆ ఒక్కడు

మరిన్ని వార్తలు