రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తగ్గిన సంస్థాగత పెట్టుబడులు

22 Jul, 2022 07:00 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇనిస్టిట్యూషన్స్‌ (సంస్థాగత) పెట్టుబడులు జూన్‌ త్రైమాసికంలో 27 శాతం తగ్గాయి. 2022 ఏప్రిల్‌–జూన్‌ మధ్య 966 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా వచ్చాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం సంస్థాగత పెట్టుబడులపై ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంలో రియల్టీలో సంస్థాగత పెట్టుబడులు 1,329 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఈ మేరకు జేఎల్‌ఎల్‌ ఒక నివేదిక విడుదల చేసింది.   

ఏప్రిల్‌–జూన్‌ కాలంలో కార్యాలయ స్థలాల విభాగంలోకి సంస్థాగత పెట్టుబడులు 652 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో పెట్టుబడులు 231 మిలియన్‌ డాలర్లుగానే ఉన్నాయి.  

హౌసింగ్‌ విభాగంలోకి సంస్థాగత పెట్టుబడులు 60 మిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇవి 78 మిలియన్‌ డాలర్ల మేర ఉన్నాయి.  

రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌లో సంస్థాగత పెట్టుబడులు గణనీయంగా తగ్గి 51 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 278 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

డేటా సెంటర్లు, గోదాముల ప్రాజెక్టుల్లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు 2,630 మిలియన్‌ డాలర్ల నుంచి 1,909 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 

సంస్థాగత పెట్టుబడులు అంటే.. కుటుంబ సంస్థలు, విదేశీ కార్పొరేట్‌ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, పెన్షన్‌ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ, రియల్‌ ఎస్టేట్‌ ఫండ్‌ డెవలపర్స్, విదేశీ నిధులతో నడిచే ఎన్‌బీఎఫ్‌సీలను పరిగణిస్తారు.  

బ్యాంకింగ్‌ రంగం నుంచి రియల్‌ ఎస్టేట్‌లోకి నిధుల రాక గడిచిన మూడున్నరేళ్లుగా గణనీయంగా పెరగడాన్ని జేఎల్‌ఎల్‌ నివేదిక ప్రస్తావించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో బ్యాంకుల నుంచి రియల్‌ ఎస్టేట్‌ రంగానికి 4 బిలియన్‌ డాలర్ల రుణాలు మంజూరైనట్టు తెలిపింది.  

కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ 
‘‘ఆఫీస్‌ స్పేస్‌ విభాగంలో పెట్టుబడులు తిరిగి పుంజుకున్నాయి. ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండడం పెట్టుబడులకు డిమాండ్‌ పెంచింది. కోర్‌ అసెట్స్‌కు కూడా డిమండ్‌ నెలకొంది. అంటే అద్దెలు వచ్చే ఆస్తుల పట్ల ఆసక్తి నెలకొందనడానికి ఇది సంకేతం’’అని జేఎల్‌ఎల్‌ ఇండియా క్యాపిటల్‌ మార్కెట్‌ హెడ్‌ లతా పిళ్లై తెలిపారు. డేటా సెంటర్లు, వేర్‌హౌస్‌ విభాగాల్లో పెట్టుబడులను గమనించాల్సి ఉందన్నారు. రానున్న త్రైమాసికాల్లో ఈ విభాగాల్లో భూమి/ఆస్తుల కొనుగోళ్లు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు