రియల్టీ పెట్టుబడులు అప్‌

14 Oct, 2021 06:24 IST|Sakshi

క్యూ3లో రూ. 5,430 కోట్లు

న్యూఢిల్లీ: ఈ కేలండర్‌ ఏడాది(2021) మూడో త్రైమాసికంలో రియల్టీ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 17 శాతం ఎగశాయి. వార్షిక ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ3)లో 72.1 కోట్ల డాలర్ల(రూ. 5,430 కోట్లు)కు చేరాయి. హౌసింగ్‌ డేటా సెంటర్, వేర్‌హౌసింగ్‌ ప్రాజెక్టులకు ప్రధానంగా నిధులు ప్రవహించినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ జేఎల్‌ఎల్‌ ఇండియా పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాలో కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పొరేట్‌ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, పెన్షన్‌ ఫండ్స్, పీఈ సంస్థలు తదితరాలున్నాయి.

వీటితోపాటు ఆర్‌ఈఐటీలలో యాంకర్‌ ఇన్వెస్టర్లు సైతం చేరినట్లు నివేదికలో జేఎల్‌ఎల్‌ తెలియజేసింది. పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచిన వివరాల ఆధారంగా గణాంకాలను రూపొందినట్లు వెల్లడించింది. టెర్మ్‌ షీట్‌పై సంతకాలు లేదా లావాదేవీల ప్రకటనల ఆధారంగా పెట్టుబడుల కాలాన్ని పరిగణించినట్లు పేర్కొంది. ఇది పెట్టుబడుల బదిలీ ఆధారితంకానప్పటికీ డేటా సెంటర్‌ విభాగంలో మాత్రం వీటిని మదింపు చేసినట్లు వివరించింది. అనిశి్చతులు, అవాంతరాల నేపథ్యంలోనూ క్యూ3లో 17 శాతం పెట్టుబడులు లభించినట్లు ప్రస్తావించింది. అయితే త్రైమాసికవారీగా చూస్తే 47 శాతం క్షీణించినట్లు తెలియజేసింది.  

వివరాలిలా
రెసిడెన్షియల్‌ రంగంలో 21.1 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించగా.. డేటా సెంటర్‌కు 16.1 కోట్ల డాలర్లు, మిక్స్‌డ్‌ వినియోగ ప్రాజెక్టులకు 13.7 కోట్ల డాలర్లు చొప్పున అందినట్లు జేఎల్‌ఎల్‌ పేర్కొంది. అయితే కార్యాలయ విభాగంలో పెట్టుబడులు 40.5 కోట్ల డాలర్ల నుంచి 10 కోట్ల డాలర్లకు భారీగా క్షీణించాయి. ఇక వేర్‌హౌసింగ్‌ విభాగంలో 9.4 కోట్ల డాలర్లు, భూములకు 1.8 కోట్ల డాలర్లు చొప్పున ఇన్వెస్ట్‌మెంట్స్‌ లభించాయి.

మరిన్ని వార్తలు