బీమా కంపెనీల జోరు.. ప్రీమియం ఆదాయం రూ.27,177 కోట్లు

8 Dec, 2021 09:13 IST|Sakshi

నవంబర్‌లో 42 శాతం వృద్ధి 

న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు ఈ ఏడాది నవంబర్‌లోనూ చక్కని వృద్ధి దిశగా ప్రయాణించాయి. నూతన  పాలసీల విక్రయం రూపంలో ప్రీమియం ఆదాయం (న్యూ బిజినెస్‌ ప్రీమియం) 42 శాతం వృద్ధిని చూపించింది. రూ.27,177 కోట్లు వసూలైనట్టు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేశాయి. 24 జీవిత బీమా కంపెనీలు ఉమ్మడిగా వసూలు చేసుకున్న నూతన బిజినెస్‌ ప్రీమియం ఆదాయం 2020 నవంబర్‌ నెలలో రూ.19,159 కోట్లుగా ఉంది.  

ఎల్‌ఐసీ పైచేయి 
బీమా దిగ్గజం, ప్రభుత్వరంగంలోని ఎల్‌ఐసీ 2021 నవంబర్‌ నెలలో నూతన ప్రీమియం ఆదాయంలో 32 శాతం వృద్ధిని చూపించింది. రూ.15,968 కోట్లు వసూలైంది. అంతక్రితం ఏడాది సరిగ్గా ఇదే నెలలో కొత్త పాలసీల రూపంలో వచ్చిన ప్రీమియం ఆదాయం రూ.12,093 కోట్లుగా ఉంది. మిగిలిన 23 ప్రైవేటు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు నూతన బిజినెస్‌ ప్రీమియం ఆదాయంలో 59 శాతం వృద్ధిని చూపించడం గమనార్హం. రూ.11,210 కోట్ల ఆదాయాన్ని ఇవి నమోదు చేశాయి. అంతక్రితం ఏడాది నవంబర్‌లో వీటి నూతన పాలసీల ప్రీమియం ఆదాయం రూ.7,067 కోట్లుగా ఉంది. 

మెజారిటీ వాటా ఎల్‌ఐసీకే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  నవంబర్‌ వరకు 8 నెలల్లో.. 24 జీవిత బీమా సంస్థల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 8.46 శాతం పెరిగి రూ.1,80,765 కోట్లుగా నమోదైంది. ఒక్క ఎల్‌ఐసీ కొత్త ప్రీమియం 0.93 శాతం వృద్ధితో రూ.1,14,581 కోట్లుగా ఉంది. 63.39 శాతం వాటాతో జీవిత బీమా మార్కెట్‌లో ఎల్‌ఐసీ నంబర్‌–1గా కొనసాగుతోంది.  
 

మరిన్ని వార్తలు