ఈపీఎఫ్‌ సభ్యులకు బీమా రూ.7 లక్షలు

30 Apr, 2021 00:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులకు ఇక మీదట గరిష్టంగా రూ.7 లక్షల జీవిత బీమా సదుపాయం లభించనుంది. ప్రస్తుతం గరిష్ట బీమా రూ.6 లక్షలుగా ఉండగా, రూ.7 లక్షలకు పెంచాలన్న ఈపీఎఫ్‌వో ట్రస్టీల నిర్ణయాన్ని కేంద్ర కార్మిక శాఖ ఆమోదించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను బుధవారం జారీ చేసినట్టు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌గంగ్వార్‌ తెలిపారు. 2020 సెప్టెంబర్‌ 9నాటి ఈపీఎఫ్‌వో కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో.. మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ అధ్యక్షతన బీమా కవరేజీని రూ.7లక్షలకు పెంచాలని నిర్ణయించడం గమనార్హం.

ఈపీఎఫ్‌వో సభ్యులకు ‘ఎంప్లాయీస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ 1976’ (ఈడీఎల్‌ఐ) కింద బీమా కవరేజీ అమలవుతోంది. ఈ పథకం కింద కనీస బీమా రూ.2.5 లక్షలుగా ఉంది. మరణించడానికి ముందు 12 నెలల్లో ఒకటికి మించిన సంస్థల్లో పనిచేసినా బీమా సదుపాయం వర్తింపజేయాలని గతేడాది మార్చిలోనే నిర్ణయించిన విషయం గమనార్హం. గతంలో అయితే చనిపోవడానికి ముందు 12 నెలల్లో సభ్యుడు ఒక్కటికి మించిన సంస్థల్లో పనిచేస్తే బీమా సదుపాయం ఉండేది కాదు. ఉద్యోగి మరణానికి ముందు 12 నెలల్లో అందుకున్న సగటు వేతనానికి (మూలవేతనం, కరువు భత్యం కలిపి) 30 రెట్ల వరకు బీమా సదుపాయం ఉంటుంది. బీమా కవరేజీకి ఉద్యోగి కనీసం ఇంతకాలం పనిచేయాలన్న నిబంధనేదీ లేదు.

మరిన్ని వార్తలు