రోడ్డుపై ఈ తరహా వాహానాలు ఎక్కువగా ఉంటే జాగ్రత్త! లేదంటే ప్రాణాలకే ప్రమాదం

18 Mar, 2022 15:33 IST|Sakshi

రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెల్లడైంది. అమెరికాలో ఇటీవల నిర్వహించిన సర్వేలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. రోడ్డు ప్రమాదాలకు ఇటువంటి కారణాలు కూడా ఉంటాయా అనేట్టుగా నిజాలు బయటపడ్డాయి.

అమెరికాకు చెందిన ఇన్సురెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైవే సేఫ్టీ (ఐఐహెచ్‌ఎస్‌) సంస్థ ఇటీవల రోడ్డు ప్రమాదాలు, అందులో చనిపోతున్న వ్యక్తులకు సంబంధించిన డేటాను విశ్లేషించింది. రోడ్డు ప్రమాదాలో ఎక్కువగా మరణాలకు కారణం అవుతున్న వాహనాల్లో స్పోర్ట్స్‌ యూటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూఈ), పికప్‌ వెహికల్స్‌ ఉన్నట్టుగా తేలింది.

దీంతో స్పోర్ట్స్‌ యూటిలిటీ వెహికల్స్‌, పికప్‌ వెహికల్స్‌పై మరోసారి పరిశీలన చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఎస్‌యూవీ, పికప్‌ వెహికల్స్‌లో ముందు వైపు ఇరుపక్కలా పెద్దగా ఉండే పిల్లర్స్‌ కారణంగా డ్రైవర్‌కి బ్లైండ్‌ స్పాట్స్‌ ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మూల మలుపులు తీసుకునే సమయంలో ఈ బ్లైండ్‌స్పాట్స్‌ డ్రైవర్‌ దృష్టి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్టుగా గుర్తించారు.

ఎస్‌యూవీ, పికప్‌ వెహికల్ డ్రైవర్లకు ఏర్పడుతున్న బ్లైండ్‌స్పాట్‌ల వల్ల  రోడ్డు కదులుతున్న లేదా నిలబడి ఉన్న వ్యక్తులను గుర్తించడంలో పొరపాట్లు జరుగుతున్నట్టుగా తేలింది. సాధారణ ప్యాసింజర్‌ వెహికల్స్‌లో ఈ సమస్య కొద్ది మొత్తంలోనే ఉండగా ఎస్‌యూవీ, పికప్‌ వెహికల్స్‌లో ఎక్కువగా ఉన్నట్టు ఐఐహెచ్‌ఎస్‌ పరిశీలనలో వెల్లడైంది.

2020లో రోడ్డు ప్రమాదాల కారణంగా అమెరికాలో 6,519 మంది చనిపోయారు. అంతుకు ముందు ఏడాదితో పోల్చితే ఇది నాలుగు రెట్లు అధికం. ఇక 2009 నుంచి 2019 రోడ్డు ప్రమాదాల గణాంకాలను పోల్చితే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఏకంగా 59 రెట్లు పెరిగింది. గత కొంత కాలంగా అమెరికాలో ఎస్‌యూవీ అమ్మకాలు పెరిగిపోయాయి. మరోవైపు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. 

రోడ్డు ప్రమాదాలకు ఒక్క ఎస్‌యూవీ, పికప్‌ వెహికల్స్‌నే బాధ్యులను చేయలేం, అదే సమయంలో ప్రమాదాల్లో ఎక్కువగా ఉన్న ఈ వాహనాల సంఖ్యను విస్మరించలేం. మరింత అధ్యయనం చేసి తగు విధమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఐఐహెచ్‌ఎస్‌ అంటోంది.

మరిన్ని వార్తలు