భారత్‌కు రానున్న అమెరికన్‌ దిగ్గజ కంపెనీ..!

28 Dec, 2021 13:58 IST|Sakshi

అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ భారత్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిప్‌సెట్‌ మేకర్‌ ఇంటెల్‌ భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ...సెమికండక్టర్స్‌ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు తయారీని కూడా పెంచే సెమీకండక్టర్లపై ఇటీవల కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్‌ ఆధారిత చిప్‌సెట్ దిగ్గజం ఒక ప్రకటనను చేసింది. 

వెల్‌ కమ్‌ టూ ఇండియా..!
దేశీయంగా సెమీకండక్టర్ పరిశ్రమ విస్తరణకు, దిగుమతులను తగ్గించి, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర సర్కారు ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రణధీర్ ఠాకూర్ ట్విటర్‌లో అభినందించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీకి భారత్ ప్రోత్సాహకాలు ప్రకటించడం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ హబ్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు భారత ప్రభుత్వానికి, అశ్విని వైష్ణవ్ కు అభినందనలు. సరఫరా చైన్ లో భాగమైన.. నైపుణ్యం, డిజైన్, తయారీ, టెస్ట్, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ ఇలా అన్ని అంశాల కలయికల ప్రణాళికలు  చూసి సంతోషిస్తున్నామని రణధీర్ ఠాకూర్ ట్వీట్‌లో వెల్లడించారు. దీనికి జవాబుగా ‘ఇంటెల్-వెల్ కమ్ టు ఇండియా’ అంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.


 

చైనా, తైవాన్లపైనే ఆధారం..!
చిప్స్‌ తయారీ విషయంలో భారత ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు చైనా, తైవాన్‌ దేశాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ యూనిట్లు ఏర్పాటు కాలేదు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు ఊపందుకున్నాయి. వీటికి చేయూతగా చిప్స్‌ తయారీ కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. 

భారత్‌ గ్లోబల్‌ హబ్‌గా..
చిప్‌ తయారీలో భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్దం చేసింది. అందులో భాగంగా గత వారం దిగ్గజ చిప్ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం రూ. 76,000 కోట్ల పథకాన్ని ఆమోదించింది. దీంతో  భారత్‌లో సెమీకండక్టర్, డిస్‌ప్లే తయారీని పెంచడానికి ఊతమిచ్చినట్లూ ఉంటుందని అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో స్వావలంబన సాధించడం, భారీ పెట్టుబడులు తీసుకురావడం, లక్ష మందికి పరోక్ష ఉపాధితో పాటు 35,000 ప్రత్యేక ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ  భారీ ప్రణాళిక కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసిందని, కాంపౌండ్ సెమీకండక్టర్ యూనిట్లు,  డిజైన్, ప్యాకేజింగ్ కంపెనీలు వచ్చే 3-4 నెలల్లో ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నట్లు వైష్ణవ్ తెలిపారు.
 


చదవండి: మోదీ ప్రభుత్వం భారీ స్కెచ్‌..! వచ్చే మూడేళ్లలో..!

మరిన్ని వార్తలు