కొత్త ఏడాదిలో జెట్ ఎయిర్ వేస్‌కు భారీ షాక్! బిగ్‌బుల్‌ వల్లేనా?

6 Jan, 2022 08:04 IST|Sakshi

ముంబై: కొత్త ఏడాదిలో జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థకు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుధీర్ గౌర్ షాక్ ఇచ్చారు. తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదివికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజీనామా చేయడానికి గల కారణాలను మాత్రం గౌర్ వెల్లడించలేదు. అయితే రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ వల్లే..  గౌర్ నిష్క్రమణ జరిగిందా? అనే కోణంలో ప్రత్యేక చర్చ మొదలైంది ఇప్పుడు.


నరేష్ గోయల్ స్థాపించిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభం కారణంగా రెండు సంవత్సరాల పాటు సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. తిరిగి 2022లో జెట్‌ ఎయిర్‌వేస్‌ 2.0 పేరుతో సర్వీసుల్ని పున:ప్రారంభించాల్సి ఉంది. ఈ విషయాన్ని జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకున్న జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం అధికారికంగా వెల్లడించింది కూడా. మరోవైపు 2022 మొదటి త్రైమాసికంలో(వేసవిలోపే) విమానయాన సంస్థను పునఃప్రారంభించడానికి గత ఏడాది ఎన్‌సిఎల్‌టి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ఇన్వెస్ట్‌మెంట్‌ గురు, బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ ఎయిర్‌’ను కూడా తొలి త్రైమాసికంలోనే తెచ్చే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు. ఇదివరకే 'ఆకాశ ఎయిర్‌' బ్రాండ్‌ కింద ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తేలిసిందే. ఈ మధ్యే లోగోను లాంఛ్‌ చేయగా..  బోయిగ్‌ సంస్థతో విమానాల కోసం ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి తాతాల్కిక సీఈవో వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. సుధీర్ గౌర్ ఆకాశ ఎయిర్‌లో చేరతారా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. 

ఇక నిధుల కొరత, మితిమీరిన రుణం భారంతో 2019లో జెట్ ఎయిర్‌వేస్ తన విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బిడ్డింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకున్న జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ 2021 జూన్‌లో ఆమోదం తెలిపింది. 2022 నుంచి తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం భావించింది. 

(చదవండి: అమెరికాలో అమెరికన్‌ కంపెనీకి దిమ్మదిరిగే షాక్‌..!)

మరిన్ని వార్తలు