కోవిడ్‌ పూర్వ స్థాయికి అంతర్జాతీయ ప్రయాణికులు

13 Jul, 2022 01:21 IST|Sakshi

2022–23లో విమానయానంపై ఇక్రా అంచనా 

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ నుంచి విదేశీ రూట్లలో రాకపోకలు సాగించే అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఇది కోవిడ్‌ పూర్వ స్థాయిలో 96–97 శాతం స్థాయికి చేరవచ్చని రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. 2022–23లో ఇది 32.9 కోట్లు – 33.2 కోట్ల స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. 2024 మార్చి ఆఖరు నాటికి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ .. కోవిడ్‌ ముందు స్థాయిని దాటేయొచ్చని వివరించింది. కోవిడ్‌–19పరమైన ఆంక్షల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 27 నుంచి అంతర్జాతీయ రూట్లలో పూర్తి స్థాయి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్రా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

మూడు నెలలుగా అప్‌.. 
అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య గత మూడు నెలలుగా క్రమంగా పెరుగుతోంది. జూన్‌ నెలలో కోవిడ్‌ పూర్వ స్థాయిలో 79 శాతానికి చేరింది. మొత్తం (దేశీ, అంతర్జాతీయ) విమాన ప్యాసింజర్ల సంఖ్య.. కోవిడ్‌ ముందు స్థాయిలో 88 శాతానికి పెరిగిందని ఇక్రా సీనియర్‌ అనలిస్ట్‌ అభిషేక్‌ లాహోటి తెలిపారు.  పలు కీలక దేశాల్లో విమాన సేవలు తిరిగి ప్రారంభం కావడం,  ప్రయాణాలపై ఆంక్షల తొలగింపు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు పూర్తి సామర్థ్యాలతో పనిచేస్తుండటం తదితర అంశాలు అంతర్జాతీయ ప్యాసింజర్ల ట్రాఫిక్‌ పెరగడానికి దోహదపడుతోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, మే నెలతో పోలిస్తే జూన్‌లో దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ కోవిడ్‌ పూర్వ స్థాయితో పోలిస్తే 98 శాతం నుంచి 91 శాతానికి తగ్గింది. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు తెరుచుకోవడం, విహారయాత్రలు తగ్గడం వంటి అంశాలు ఇందుకు కారణమని లాహోటి వివరించారు.   

మరిన్ని వార్తలు