మహిళా ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ కోసం ‘సమర్థ్‌’

8 Mar, 2022 05:39 IST|Sakshi

ఆవిష్కరించిన ఎంఎస్‌ఎంఈ శాఖ

International Women's Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని .. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్‌ఎంఈ) సోమవారం ’సమర్థ్‌’ పేరిట ప్రత్యేక స్కీమును ఆవిష్కరించింది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు స్వావలంబన సాధించేందుకు ఇది తోడ్పడగలదని ఈ సందర్భంగా కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి నారాయణ్‌ రాణె తెలిపారు. సమర్థ్‌ కింద ఎంఎస్‌ఎంఈ శాఖ నిర్వహించే నైపుణ్యాభివృద్ధి ఉచిత శిక్షణా స్కీములు అన్నింటిలోనూ మహిళలకు 20 శాతం సీట్లను ఔత్సాహిక మహిళా ఎంట్రప్రెన్యూర్లకు కేటాయిస్తామని పేర్కొన్నారు.

2022–23లో దీనితో 7,500 మంది పైచిలుకు మహిళలకు ప్రయోజనం చేకూరగలదని ఆయన వివరించారు. ఇక మార్కెటింగ్‌పరమైన సహకారం అందించే పథకాల్లో భాగంగా దేశ, విదేశ ఎగ్జిబిషన్లకు పంపించే ఎంఎస్‌ఎంఈ వ్యాపార బృందాల్లో 20 శాతం వాటా మహిళల సారథ్యంలోని సంస్థలకు లభిస్తుందని మంత్రి చెప్పారు. అలాగే 2022–23లో జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌ఐసీ)కి సంబంధించిన కమర్షియల్‌ స్కీముల వార్షిక ప్రాసెసింగ్‌ ఫీజులో 20 శాతం రాయితీ కూడా మహిళా ఎంట్రప్రెన్యూర్లు పొందవచ్చని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు