Work From Home: అమ్మాయిలూ.. అవకాశాలివిగో!

8 Mar, 2022 05:16 IST|Sakshi

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నైపుణ్యం ఉంటే లక్షలు మీ చేతుల్లో

చెల్లించేందుకు సిద్ధంగా కంపెనీలు

ఇంటి వద్ద నుంచే ఆర్జనకు ఆస్కారం

ఆసరాగా నిలుస్తున్న సాంకేతికత

మహమ్మారి పుణ్యమాని మహిళలను కొత్త అవకాశాలు ఊరిస్తున్నాయి. పెట్టుబడి లేకుండా ఇంటి పట్టున ఉంటూనే సంపాదించే మార్గాలూ పుట్టుకొచ్చాయి. విదేశీ గడ్డపైనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు.. అదే విదేశీ సంస్థకు ఇంటి నుంచే పని చేసే పరిస్థితులొచ్చాయి. కావాల్సిందల్లా నైపుణ్యం పెంచుకుని, అవకాశాన్ని అందిపుచ్చువడమే. మార్కెట్‌కు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకున్న మహిళల కోసం కంపెనీలు క్యూ కడు తున్నాయి. అడిగినంత వేతనం..  ఇచ్చేందుకూ దిగ్గజ సంస్థలు వెనుకాడడం లేదు. వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై  నిపుణుల అభిప్రాయాలతో సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రత్యేక కథనం..

వ్యాపారం ఆకర్షణీయం..
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసే రోజులు పోయాయి. మహిళలకు వ్యాపారం అనుకూల, ఆకర్షణీయ  కెరీర్‌గా మారిపోయింది. వ్యాపారంలో వైఫల్యాలనూ అంగీకరిస్తున్నారు. టెక్నాలజీ సాయంతో చిన్నగా ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎదగొచ్చు అని నిరూపిస్తున్నారు. డబ్బులు సంపాదించడమేగాక వందలాది మందికి ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తున్నారు. బిజినెస్‌లోకి రావాలంటే డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. అంకిత భావం, సరైన మార్గదర్శి ఉండాలి. వ్యాపారం పేరుతో గతంలో ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా అవసరం మేరకే లోన్‌ తీసుకుంటున్నారు. దీంతో బ్యాంకులూ రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి.  
    –దీప్తి రావుల, సీఈవో, వీ–హబ్‌

ప్రత్యేక నైపుణ్యంతో..
కోవిడ్‌ రాకతో ఆటోమేషన్, డిజిటల్‌ పరివర్తన దిశగా కంపెనీలు సాగుతున్నాయి. ఇదే మహిళలకు కొత్త అవకాశాలను అందిస్తోంది. విదేశాలకు వెళ్లకుండానే ఎంఎన్‌సీల్లో జాబ్‌ సంపాదించి ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేక నైపుణ్యం ఉన్న మహిళల కోసం కంపెనీలు ప్రపంచం నలుమూలలా వెతుకుతున్నాయి. ఐటీతోపాటు ఫార్మా, బయాలాజిక్స్‌లోనూ ఇదే పరిస్థితి. అన్ని రంగాల్లోనూ కంపెనీలు సామర్థ్యం పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. ఒక రోల్‌లో కొరత ఉందంటే చాలు అభ్యర్థులకు కాసులు కురిపిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో రూ.5 లక్షల వేతనం ఉంటే.. కొత్త సంస్థ రూ.50 లక్షలు చెల్లించేందుకూ వెనుకాడడం లేదు. అమ్మాయిలకు స్థిరత్వం, నిబద్ధత ఉంటుందన్న భావన కంపెనీల్లో పెరిగింది. వీరికి అత్యంత కీలక విభాగాలనూ అప్పగిస్తున్నారు.  
– జయశ్రీ పవని, హెడ్, స్ట్రాటజిక్‌ రిక్రూట్‌మెంట్, స్ట్రయిక్‌ ఇట్‌–రైట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌

పెట్టుబడి లేకుండానే..
టెక్నాలజీని ఊతంగా చేసుకుని ఉపాధికి కొత్త మార్గాలను వెతుక్కుని మహిళలు సక్సెస్‌ అవుతున్నారు. పెట్టుబడి లేకుండానే ఇంటి నుంచే సంపాదిస్తున్నారు. వ్యాపారం చేయాలన్న తపన పల్లెల్లోని మహిళలకూ విస్తరించింది. సోషల్‌ మీడియాలో ఎంత చురుకుగా ఉంటే అంతలా ఆదాయం గడిస్తున్నారు. రాష్ట్రాలే కాదు విదేశీ గడ్డపైనా వ్యాపారాలను విస్తరిస్తున్నారు. ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుని డిజిటల్‌ మార్కెటింగ్, ఈవెంట్స్, యూట్యూబ్‌ బ్లాగ్స్, ట్యూషన్స్, డ్యాన్స్, మ్యూజిక్, న్యాయ సలహాలు, క్రాఫ్టŠస్, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్, మోటివేషనల్‌ క్లాసెస్‌ వంటివి ఉపాధిగా ఎంచుకుంటున్నారు. బ్యూటీ, ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌గా, ఫిట్నెస్‌ శిక్షకులుగా కెరీర్‌ మలుచుకుంటున్నారు. ఇంటి వంటకాలను స్విగ్గీ, జొమాటో ద్వారా విక్రయిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే అదనపు సంపాదనపై దృష్టిపెడుతున్నారు.      
     – లత చౌదరి బొట్ల, ఫౌండర్, నారీసేన.

ఉద్యోగం మానేసినా..
 అప్లికేషన్, ప్రాజెక్ట్‌ రూపకల్పన, అమలుకు ఐటీ కంపెనీలు విభిన్న సాంకేతికలను (టెక్‌ స్టాక్‌) ఉపయోగిస్తాయి. అభ్యర్థిలో టెక్నికల్‌ స్కిల్స్‌ ఏ మేరకు ఉన్నాయన్నదే ప్రధానం. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అదనపు అర్హత మాత్రమే. కొత్త కోర్సులను నేర్చుకుని నూతన వర్షన్స్‌కు తగ్గట్టుగా అభ్యర్థులు అప్‌గ్రేడ్‌ అవ్వాలి. ఇలాంటి ఉద్యోగులకు ఒక్కొక్కరి చేతుల్లో మూడుకుపైగా ఆఫర్‌ లెటర్లు ఉంటున్నాయి. ఎక్కడ అధిక వేతనం ఆఫర్‌ చేస్తే అక్కడే చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులు చేజారకుండా ప్రమోషన్‌తో వేతనం పెంచుతున్నాయి. మధ్యలో ఉద్యోగం మానేసినా నైపుణ్యం ఉన్న అభ్యర్థులను మళ్లీ చేర్చుకుంటున్నాయి.      
– రేచల్‌ స్టెల్లా రాజ్, టాలెంట్‌ అక్విజిషన్‌ అనలిస్ట్‌

మరిన్ని వార్తలు