International Womens Day: అవగాహన ఉన్నా వినియోగం కొంతే..

7 Mar, 2023 00:46 IST|Sakshi

మహిళలకు ఆర్థిక సేవలపై ఆర్‌బీఐ అధ్యయనం

పిల్లల చదువుల కోసం పొదుపునకు ప్రాధాన్యం

ముంబై: ఆర్థిక సేవలపై మహిళలకు అవగాహన పెరుగుతున్నప్పటికీ వారు వాటిని వినియోగించుకోవడం తక్కువగానే ఉంటోంది. బీమా తదితర సాధనాల గురించి మూడో వంతు మందికి తెలిసినా కూడా డిజిటల్‌ విధానంలో కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్క శాతం కూడా ఉండటం లేదు. రిజర్వ్‌ బ్యాంక్‌లో భాగమైన రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్, డిజిటల్‌ చెల్లింపుల నెట్‌వర్క్‌ పేనియర్‌బై నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం మహిళల్లో .. ముఖ్యంగా 18–35 ఏళ్ల వారిలో బీమాపై అవగాహన గతేడాది 29 శాతం మేర పెరిగింది. కానీ పాలసీల వినియోగం 1 శాతానికి లోపే ఉంది. మహిళలు ఎక్కువగా జీవిత బీమా, ఆరోగ్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. 5,000 రిటైల్‌ స్టోర్స్‌లో ఆర్థిక సేవలను వినియోగించుకున్న ఈ వయస్సు గ్రూప్‌ మహిళలపై నిర్వహించిన సర్వే ద్వారా అధ్యయన నివేదిక రూపొందింది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు..

► రిటైల్‌ స్టోర్స్‌లో మహిళలు ఎక్కువగా నగదు విత్‌డ్రాయల్, మొబైల్‌ రీచార్జీలు, బిల్లుల చెల్లింపుల సర్వీసులను వినియోగించుకుంటున్నారు. ఇతర త్రా పాన్‌ కార్డు దరఖాస్తులు, వినోదం, ప్రయాణాలు, ఈ–కామర్స్‌ మొదలైన వాటి సంబంధిత లావాదేవీలూ చేస్తున్నారు.
► తమ పిల్లలకు మంచి చదువు ఇవ్వడానికి అత్యధిక శాతం మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు పొదుపే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు 68% మంది తెలిపారు. ఇక అత్యవసర వైద్యం, ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల కొనుగోలు కోసం పొదుపు చేసుకోవడమూ యవారికి ప్రాధాన్యతాంశాలు.
► నగదు లావాదేవీలను తగ్గించడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా చాలా మంది మహిళలు నగదు రూపంలో లావాదేవీలు జరపడానికే ప్రాధాన్యమిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 48 శాతం మంది నగదువైపే మొగ్గు చూపారు. నగదు విత్‌డ్రాయల్‌ సర్వీసుల కోసమే రిటైల్‌ స్టోర్‌ను సందర్శిస్తామంటూ 78 శాతం మంది తెలిపారు.
► అయితే, అదే సమయంలో డిజిటల్‌ చెల్లింపుల కోసం యూపీఐ వినియోగమూ పెరుగుతోంది. 5–20% మంది మహిళలు దీనిని ఎంచుకుంటున్నారు. క్రెడిట్‌ కార్డుల వినియోగం దాదాపు శూన్యమే.
► డిజిటల్‌ మాధ్యమం వినియోగం.. 18–40 ఏళ్ల గ్రూప్‌ మహిళల్లో  ఎక్కువగా ఉంటోంది. వారిలో 60%మందికి పైగా మహిళలకు స్మార్ట్‌ఫోన్లు, వాటి ద్వారా డిజిటల్‌ కంటెంట్‌ అందుబాటులో
ఉంటోంది.

మరిన్ని వార్తలు