స్టార్టప్స్‌లో పెట్టుబడులు: ఈ షేరు రాకెట్‌ స్పీడ్‌

18 Nov, 2020 14:07 IST|Sakshi

సరికొత్త గరిష్టానికి ఇన్ఫో ఎ‍డ్జ్‌ ఇండియా

2006లో తొలిసారి లిస్టయిన్‌ ఇంటర్నెట్‌ షేరు

గత రెండేళ్లలో 187 శాతం జూమ్

‌అనుబంధ సంస్థలలో నౌకరీ, జీవన్‌సాథీ, 99ఏకర్స్‌

జొమాటో తదితర 23 స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్

ముంబై, సాక్షి: ఇంటర్నెట్‌ ఆధారిత సేవల కంపెనీ ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా లిమిటెడ్‌ షేరు తాజాగా సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత దాదాపు 2 శాతం పుంజుకుని రూ. 3,988కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం యథాతథంగా రూ. 3,925 వద్ద ట్రేడవుతోంది. గత రెండేళ్లలో ఈ కౌంటర్‌ 187 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇందుకు ప్రధానంగా కంపెనీ అనుబంధ సంస్థలైన జాబ్‌ పోర్టల్‌, మాట్రిమోనీ, రియల్టీ పోర్టల్‌ ప్రభావం చూపుతున్నాయి. దీనికితోడు కంపెనీ జొమాటో, పాలసీ బజార్‌సహా కనీసం 23 స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో జొమాటో ఇటీవల పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగినట్లు పేర్కొన్నారు. కంపెనీ నౌకరీ, 99ఏకర్స్‌, జీవన్‌సాథీ, శిక్ష తదితర పోర్టళ్లను నిర్వహించే సంగతి తెలిసిందే.

తొలి లిస్టెడ్‌ కంపెనీ
డాట్‌కామ్‌ బూమ్‌ సమయంలో అంటే 1995లో ఆవిర్భవించిన ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా లిమిటెడ్‌ 2006 నవంబర్‌లో దేశీయంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. తద్వారా దేశీయంగా లిస్టయిన తొలి ఇంటర్నెట్‌ కంపెనీగా గుర్తింపు పొందింది. ఇటీవల ఇన్ఫీబీమ్‌, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, రూట్‌ మొబైల్స్‌ తదితర పలు కంపెనీలు లిస్టయ్యాయి. టెమాసెక్‌, టైగర్‌ గ్లోబల్‌, చైనీస్‌ యాంట్‌ గ్రూప్‌నకు సైతం వాటాలు కలిగిన ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్‌కు సుమారు 20 శాతం వరకూ వాటా ఉన్నట్లు అంచనా. జొమాటోకు విదేశీ రీసెర్చ్‌ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ ఏకంగా 5 బిలియన్‌ డాలర్ల విలువను అంచనా వేయడం గమనార్హం. దీంతో ఇటీవల ఇన్ఫో ఎడ్జ్‌ కౌంటర్‌ మరింత జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు