అపార్ట్‌మెంట్‌ బదులు భూములు కొంటే 10 రెట్ల లాభం! ఎలాగో తెలుసా?

22 Sep, 2023 20:30 IST|Sakshi

పెట్టుబడి మార్గంగా అపార్ట్‌మెంట్‌ కొంటున్నారా? అయితే సిద్ధంగా ఉన్న అపార్ట్‌మెంట్‌ కంటే భూమిపై పెట్టుబడి పెట్టడం వల్ల 10 రెట్లు ఎక్కువ రాబడిని ఇస్తుందని కొలియర్స్ (Colliers)అడ్వైజరీ సర్వీసెస్ ప్రచురించిన నివేదిక తెలిపింది. 

అద్దె రూపంలో రాబడి
అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో భూములు కొని అద్దెకు ఇవ్వడం ద్వారా అపార్ట్‌మెంట్‌ల కంటే 10 రెట్లు అధిక రాబడి పొందవచ్చని కొలియర్స్ నివేదిక పేర్కొంది. సిటీ సెంటర్‌కు సమీపంలో ఉండటం, రాబోయే మౌలిక సదుపాయాలు, సామాజిక సౌకర్యాలు, పర్యాటక ఆకర్షణలు, ఆర్థిక స్థోమత వంటివి దేశ వ్యాప్తంగా ప్రాపర్టీ అప్రిషియేషన్‌కు కీలకమైన చోదకాలుగా ఉన్నాయని ‘టాప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కారిడార్స్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక వివరించింది.

రియల్ ఎస్టేట్ రంగంలో ట్రాక్షన్ కొనసాగుతోందని, దీనికి తోడు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగం పెరిగిందని, భారతదేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లోని మైక్రో-మార్కెట్లు కీలక పెట్టుబడి కారిడార్లుగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించింది.

పెరుగుతున్న రియల్ ఎస్టేట్ కారిడార్లు
వ్యవసాయేతర భూమి లభ్యత అత్యధికంగా ఉండటంతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాల రాక వంటి అంశాల ఆధారంగా మహారాష్ట్రలోని వసాయి విరార్, భివండి, నేరల్-మాథెరన్ వంటి ప్రాంతాలు కీలకమైన హాట్‌స్పాట్‌లుగా ఉన్నట్లు కొలియర్స్ నివేదిక గుర్తించింది. 

హైదరాబాద్‌లోనూ.. 
కీలకమైన పెట్టుబడి ప్రాంతాలలో ఒకటిగా పరిగణించే మహారాష్ట్రలోని నెరల్-మాథెరన్ మైక్రో-మార్కెట్‌లో హాలిడే హోమ్‌లకు సగటు వార్షిక అద్దె రాబడి 15 శాతం ఉంటుందని, రాబోయే 10 సంవత్సరాలలో భూమి పెట్టుబడులపై ఐదు రెట్లు రాబడిని పొందగలదని అంచనా వేసినట్లు నివేదిక పేర్కొంది. గుజరాత్‌లోని పర్యాటక, పారిశ్రామిక కేంద్రం - సనంద్ నల్ సరోవర్ కారిడార్, చెన్నైలోని ECR, హైదరాబాద్‌లోని మేడ్చల్, కోల్‌కతాలోని న్యూ టౌన్, రాజర్‌హట్‌లు కూడా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పింది.

పుష్కలమైన భూమి లభ్యత, పర్యాటకరంగంలో పెరిగిన ట్రాక్షన్, మౌలిక సదుపాయాలను పెంచడం వంటి కారణాలతో ఈ కారిడార్‌లు పెట్టుబడుల గమ్యస్థానాలుగా అభివృద్ధి చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతాలలో 2.5 నుంచి 4 శాతం సగటు వార్షిక అద్దె రాబడి  మధ్య, భూమిపై 6 నుంచి 8 శాతం వార్షిక ధర పెరుగుదల ఉంటుందని వివరించింది.

మరిన్ని వార్తలు