మెరుగైన రాబడుల కోసం ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి?

26 Sep, 2022 11:47 IST|Sakshi

నా వయసు 30 ఏళ్లు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాను. సిప్‌ కోసం ఏ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు అనుకూలం? 

మీరు తీసుకున్న మంచి నిర్ణయానికి అభినందనలు. పెట్టుబడులను మరీ ఆలస్యం చేయొద్దంటూ తరచుగా మేము చెబుతుంటాం. మీరు పన్ను ఆదా చేయడం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నట్టు అయితే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మంచి ఆప్షన్‌ అవుతుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడులు పెడితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ ఈ ప్రయోజనం కల్పిస్తోంది. ఒకవేళ మీరు కనీసం ఐదేళ్లు, అంతకంటే దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసేట్లు అయితే అందుకు ఈఎల్‌ఎస్‌ఎస్‌ మెరుగైన సాధనమే అవుతుంది. ఇవి పూర్తి ఈక్విటీ పథకాలు. వేర్వేరు మార్కెట్‌ పరిమాణంతో కూడిన, వివిధ రంగాల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి.

దీంతో దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడినిస్తాయి. అయితే, వీటిల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్‌ ఉంటుందని మర్చిపోవద్దు. సిప్‌ అయితే విడిగా ప్రతి సిప్‌ పెట్టుబడికి మూడేళ్లు అమలవుతుంది. ఒకవేళ మీరు ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఎటువంటి పన్ను ఆదాను కోరుకోనట్టయితే.. సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను ఆదా ప్రయోజనాన్ని  వాడుకుని ఉంటే, అప్పుడు మీ ప్రణాళిక వేరే విధంగా ఉండొచ్చు. మీరు అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ పథకాలు సాధారణంగా 65 నుంచి 80 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ పథకాలకు కేటాయిస్తాయి. డెట్‌ అన్నది ఈక్విటీలతో సంబంధం లేనిది. డెట్‌ పెట్టుబడుల రాబడులు ఈక్విటీల మాదిరిగా భారీ అస్థిరతలకు లోను కావు. మొదటి సారి పెట్టుబడులు పెట్టే వారికి అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ మంచి ఎంపిక అవుతుంది. కనుక ఈఎల్‌ఎస్‌ఎస్‌ లేదా అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌లో సిప్‌ మొదలు పెట్టుకోవచ్చు. రెండు నుంచి మూడేళ్ల పాటు వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసి, ఈక్విటీలు ఎలా పనిచేస్తాయో అవగాహన వచ్చిన తర్వాత.. అప్పుడు అచ్చమైన ఈక్విటీ పథకాలైన.. ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ను దీర్ఘకాల లక్ష్యాల కోసం ఎంపిక చేసుకోవచ్చు.  

నేను రూ.50,000 మొత్తాన్ని మూడు నుంచి ఆరు నెలల కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నా ను. మా పిల్లల విద్య కోసం ఆరు నెలల తర్వాత ఈ మొత్తం కావాల్సి ఉంది. మెరుగైన రాబడుల కోసం ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకోవాలి?

ఇంత స్వల్ప కాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ముందు లక్ష్యం విషయంలో రాజీ పడడానికి అవకాశం ఉండదు. ఎంతో కాలం లేదు కనుక పెట్టుబడికి భద్రత ఎక్కువ ఉండాలి. రాబడుల కంటే పెట్టుబడిని కాపాడుకునే విధంగా వ్యూహం ఉండాలి. కనుక ఈ మొత్తాన్ని మీరు బ్యాంకు ఖాతాలోనే కొనసాగించుకోవచ్చు. లేదంటే ఆరు నెలల కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. వీటిల్లో రాబడులు తక్కువే అయినా గ్యారంటీతో కూడినవి.

పైగా పెట్టుబడికి భద్రత ఎక్కువ. ఆరు నెలలే ఉంది కనుక కచ్చితంగా ఆ సమయానికి పెట్టుబడిని రాబడితో పాటు సులభంగా వెనక్కి తీసుకోవచ్చు. బ్యాంకులో చేసే డిపాజిట్‌ రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ నుంచి బీమా ఉంటుంది. ఇవి కాకుండా లిక్విడ్‌ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇవి ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, రెపో సర్టిఫికెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. గరిష్టంగా 91 రోజుల కాల వ్యవధి కలిగిన సెక్యూరిటీల్లోనే లిక్విడ్‌ పథకాలు ఇన్వెస్ట్‌ చేస్తాయి. బ్యాంకు డిపాజిట్ల కంటే లిక్విడ్‌ ఫండ్స్‌లో కొంచెం అదనపు రాబడి వస్తుంది. కాకపోతే పెట్టుబడి భద్రతకు అవి హామీ ఇవ్వవు.

చదవండి: ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!

మరిన్ని వార్తలు