యులిప్‌లకు మళ్లీ ఆదరణ

3 Jul, 2021 08:32 IST|Sakshi

 నిధుల నిర్వహణలో సౌలభ్యం

బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: యూనిట్‌ ఆధారిత బీమా పథకాలకు (యులిప్‌/ఈక్విటీలతో కూడిన) ఇన్వెస్టర్ల నుంచి మళ్లీ ఆదరణ పెరిగింది. కరోనా సంక్షోభ సమయంలో యులిప్‌ల్లో పెట్టుబడులు పెరిగినట్టు బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యులిప్‌లలో పెట్టుబడుల నిర్వహణ సౌకర్యంగా ఉండడం కారణమని ఈ సంస్థ పేర్కొంది. సర్వే వివరాలను శుక్రవారం విడుదల చేసింది. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు రానున్న సంవత్సరంలో యులిప్‌లలో ఇన్వెస్ట్‌ చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్టు సర్వేలో చెప్పారు.

కరోనా మొదటి దశ తర్వాత యులిప్‌ల పట్ల తమకు ఇష్టం పెరిగినట్టు 92 శాతం మంది చెప్పారు. యులిప్‌ ప్లాన్లు ఒకవైపు జీవిత బీమా రక్షణ కల్పిస్తూ, మరోవైపు ఈక్విటీ, డెట్‌ సాధనాల్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తుంటాయి. ప్రీమియంలో కొంత బీమా రక్షణకు పోగా, మిగిలిన మొత్తాన్ని పాలసీదారు ఎంపిక చేసుకున్న సాధనాల్లో బీమా సంస్థ పెట్టుబడులు పెడుతుంది. నీల్సన్‌ ఐక్యూ సాయంతో బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఈ సర్వే నిర్వహించింది. మెట్రో, నాన్‌ మెట్రోల్లో 499 మంది నుంచి అభిప్రాయాలు స్వీకరించింది.

‘‘యులిప్‌లలో పెట్టుబడుల పురోగతిని సమీక్షించుకోవడం సులభంగా ఉంటుంది. వ్యయాలు తక్కువగా ఉంటాయి. రైడర్‌ లేదా టాపప్‌ జోడించుకోవడం, నిధులను వెనక్కి తీసుకోవడం సులభం’’ అని సర్వే తెలిపింది. 


ఆకర్షించే సదుపాయాలు..  

  • మధ్యాదాయ వర్గాల వారు యులిప్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు వీలుండడాన్ని ఇష్డపడుతున్నారు. 
  • 21–30 సంవత్సరాల్లోని వారు సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌/క్రమానుగత పెట్టుబడుల సాధనం) రూపంలో యులిప్‌లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. 
  • అదే 50 ఏళ్లకు పైన వయసులోని వారు యులిప్‌లో ఒకే విడత (సింగిల్‌ప్రీమియం) ఇన్వెస్ట్‌ చేసే ఆప్షన్‌ను ఇష్టపడుతున్నారు.
  • రూపాయి ఖర్చు లేకుండానే యులిప్‌లలో పెట్టుబడులను ఒక విభాగం నుంచి మరో విభాగానికి మార్చుకునే సదుపాయం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఈ సౌకర్యం లేదు. 
  • ఎక్కువ మందికి నచ్చే అంశం బీమా రక్షణకుతోడు, పెట్టుబడుల అవకాశం ఉండడం.  


అన్ని వర్గాలకూ నచ్చే సాధనం.. 
‘‘అన్ని రకాల వయసులు, ఆదాయ వర్గాలు, భౌగోళిక ప్రాంతాల్లోనూ యులిప్‌ల పట్ల ఆదరణ ఉన్నట్టు ఈ సర్వే రూపంలో తెలుస్తోంది. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశం ఉండడంతోపాటు, పెట్టుబడుల్లో సౌకర్యం, బీమా రక్షణ, ఉపసంహరణకు వీలు ఇవన్నీ యులిప్‌ల కొనుగోలుకు దారితీసే అంశాలు’’ అని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ముఖ్య మార్కెటింగ్‌ అధికారి చంద్రమోహన్‌ మెహ్రా తెలిపారు. తమ దీర్ఘకాల లక్ష్యాలకు బీమా ప్లాన్లు కూడా ప్రాధాన్య సాధనంగా ఎక్కువ మంది పరిగిణిస్తున్నట్టు ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు