‘సిప్‌’కి జై కొడుతున్నారు

12 Sep, 2021 09:33 IST|Sakshi

ముంబై: ఇంతకాలం చిట్టీలలో పొదుపు చేస్తూ, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో పెట్టుబడిగా పెట్టిన వారు తమ రూటు మార్చుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. నెలవారీ చెల్లింపులు చేసే అవకాశం ఉండే సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌కు క్రమంగా పెరుగుతున్న ఆధారణ  ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

పెరిగిన ఆసక్తి
కరోనా సంక్షోభం తర్వాత పొదుపు, పెట్టుబడి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇదే సమయంలో ఇంటర్నెట్‌ వాడకం కామన్‌ అయ్యింది. దీంతో టెక్నాలజీని వాడుకుంటూ తమ వద్ద ఉన్న కొద్ది మొత్తాలను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడిగా మార్చేందుకు రిస్క్‌ తీసుకుంటున్నారు. అయితే స్టాక్‌ మార్కెట్‌లో ఇంట్రా డే ట్రేడింగ్‌లో రిస్క్‌ ఎక్కువ, అయితే తక్కువ పెట్టుబడితో బ్లూ చిప్‌ కంపెనీల్లో షేర్ల కొనుగోలు కష్టంగా. దీంతో తక్కువ రిస్క్‌ కోరుకునే వారు మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌కి మొగ్గు చూపేవారు. అయితే ఆగస్టులో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు తగ్గాయి. కేవలం రూ.8,666 కోట్ల రూపాయలే వచ్చాయి. అంతకు ముందు జులైలో ఈ మొత్తం రూ.22,583 కోట్లుగా నమోదు అయ్యింది.

జోరుమీదున్న సిప్‌
నెలవారీగా చిట్టీలు కట్టినట్టు, ప్రతీ నెల ఈఎంఐలు చెల్లించినట్టు మ్యూచవల్స్‌ ఫండ్స్‌లో ప్రతీ నెల ఇన్వెస్ట్‌ చేయడాన్నే సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) అంటారు. ఆర్థిక నిపుణుల సలహా మేరకు ఒక సిప్‌ను ఎంచుకుంటే ప్రతీ నెలా కొంత మొత్తం మన అకౌంట్‌ నుంచి ఆయా కంపెనీలో పెట్టుబడిగా ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ప్రస్తుతం సిప్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క ఆగస్టులోనే సిప్‌కి సంబంధించిన అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏఎమ్‌యూ) విలువ రూ. 5.26 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది మొత్తం సిప్‌ ఏఎమ్‌యూ విలువ రూ.17.15 లక్షల కోట్లలో మూడో వంతుగా ఉంది. సిప్‌లపై చెల్లించే వడ్డీ  ఆగస్టులో లైఫ్‌టైం హైకి చేరుకుని రూ.9,923 కోట్లుగా నమోదు అయ్యింది. ఆగస్టులోనే ఏకంగా 24.92 లక్షల కొత్త సిప్‌లు మొదలయ్యాయి. మెత్తంగా 4.32 కోట్ల సిప్‌లు ఉన్నాయి. సిప్‌లకు సంబంధించి అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 53 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి.

రికార్డు స్థాయిలో
మ్యూచవల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు తగ్గినా సిప్‌లో ఖాతాలు పెరగడం వల్ల ఓవరాల్‌గా మ్యూచ్‌వల్‌ ఫండ్‌ మార్కెట్‌ పరిస్థితి మెరుగ్గానే ఉంది. 2021 ఆగస్టు నాటికి మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు 36.59 లక్షల కోట్లకు చేరుకుని ఆల్‌టైం హైని టచ్‌ చేశాయి.
చదవండి: ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు

మరిన్ని వార్తలు