బ్యాటరీ సెల్‌ తయారీపై భారీ పెట్టుబడులు

6 Sep, 2022 06:19 IST|Sakshi

2030 నాటికి 9 బిలియన్‌ డాలర్లు వస్తాయని అంచనా

బ్యాటరీ తయారీ భారీగా పెరగాలి

అప్పుడే ఈవీల ధరలు దిగొస్తాయ్‌

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక

ముంబై: బ్యాటరీ సెల్‌ తయారీలో పెట్టుబడులు 2030 నాటికి 9 బిలియన్‌ డాలర్లను (రూ.72వేల కోట్లు) అధిగమిస్తాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ డిమాండ్‌ 2030 నాటికి 60 గిగావాట్‌హవర్‌కు (జీడబ్ల్యూహెచ్‌) చేరుకుంటుందని తెలిపింది. ఈవీ ఎకోసిస్టమ్‌ అభివృద్ధిలో బ్యాటరీ తయారీ అన్నది అత్యంత కీలకమైనదిగా పేర్కొంది. బ్యాటరీల తయారీ పెద్ద ఎత్తున విస్తరించాల్సి ఉందని, ఈవీల ధరలు తగ్గేందుకు, ధరల వ్యత్యాసం తొలగిపోయేందుకు ఇది ముఖ్యమైనదిగా గుర్తు చేసింది. ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గుతాయన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించింది. చార్జింగ్‌ సదుపాయాలు అన్నవి క్రమంగా విస్తరిస్తాయని, ఇంధన సామర్థ్యంలో పురోగతి తప్పనిసరి అని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఒకే చోటకు చేరడం..   
ఎలక్ట్రిక్‌ వాహనాల ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ (ఓఈఎంలు) కంపెనీలకు సమీపంలోనే సెల్‌ తయారీ కంపెనీలు కూడా ఉండాలని.. అప్పుడు పరిశోధన, ఆవిష్కరణల ఎకోసిస్టమ్‌ ఏర్పడుతుందని ఇక్రా నివేదిక తెలియజేసింది. అప్పుడు మెరుగైన ఇంధన సామర్థ్యం, భారత వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన బ్యాటరీల తయారీ సాధ్యపడుతుందని సూచించింది. ‘‘ఎలక్ట్రిక్‌ వాహనంలో అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ బ్యాటరీలు ఎంతో ముఖ్యమైనవే కాదు, చాలా ఖరీదైనవి. వాహనం ధరలో సుమారు 40 శాతం బ్యాటరీకే అవుతోంది. ప్రస్తుతం బ్యాటరీ సెల్స్‌ భారత్‌లో తయారు కావడం లేదు. ఓఈఎంలు చాలా వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. బ్యాటరీ ప్యాక్‌ అసెంబ్లీ కార్యకలాపాలు దేశీయంగా పరిమితంగానే ఉన్నాయి. ఈవీల విస్తరణ, పోటీ ధరలకే వాటిని తయారు చేయాలంటే బ్యాటరీ సెల్స్‌ అభివృద్ధికి స్థానికంగా ఎకోసిస్టమ్‌ ఏర్పాటు కావాల్సిందే’’అని ఇక్రా గ్రూపు హెడ్‌ శంషేర్‌ దివాన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు