పీనోట్ల పెట్టుబడులు డీలా 

25 Jun, 2022 10:58 IST|Sakshi

మే నెలలో రూ. 86,706  కోట్లు  

ఏప్రిల్‌లో ఇవి రూ. 90,580 కోట్లు  

న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ(పీ) నోట్ల ద్వారా దేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో పెట్టుబడులు మే నెలలో వెనకడుగు వేశాయి. రూ. 86,706 కోట్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు నెల అంటే 2022 ఏప్రిల్‌లో ఇవి రూ. 90,580 కోట్లుగా నమోదయ్యాయి.

క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు, హైబ్రిడ్‌ సెక్యూరిటీల నుంచి గత నెలలో దాదాపు రూ. 4,000 కోట్ల పీనోట్‌ పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పీనోట్లను జారీ చేస్తుంటారు. వీటిద్వారా విభిన్న విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు రిజిస్ట్రేషన్‌ లేకుండానే దేశీయంగా ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుంటుంది. అయితే రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట వీడి దేశీ స్టాక్స్‌లో తిరిగి పెట్టుబడులు చేపట్టే వీలున్నట్లు మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.  

ఈక్విటీలకే అధికం 
ఈ ఏడాది(2022) మార్చికల్లా పీనోట్‌ పెట్టుబడులు రూ. 87,979 కోట్లకు చేరగా.. ఫిబ్రవరిలో ఇవి రూ. 89,143 కోట్లు, జనవరిలో రూ. 87,989 కోట్లను తాకాయి. గత నెల పెట్టుబడుల్లో రూ. 77,402 కోట్లు ఈక్విటీలలో, రూ. 9,209 కోట్లు రుణ సెక్యూరిటీలలో, మరో రూ. 101 కోట్లు హైబ్రిడ్‌ సెక్యూరిటీల లోనూ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్‌ పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా రూ. 81,571 కోట్లు కాగా.. రూ. 8,889 కోట్లు రుణ సెక్యూరిటీలకు మళ్లాయి.

పదేళ్లకాలపు ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ బలపడుతుండటంతో ఇటీవల ఈక్విటీల నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నట్లు గ్రీన్‌ పోర్ట్‌ఫోలియో వ్యవస్థాపకుడు దివమ్‌ శర్మ పేర్కొన్నారు. పీనోట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నీరసించిన నేపథ్యంలో ఎఫ్‌పీఐల కస్టడీలో ఉన్న ఆస్తుల(పెట్టుబడులు) విలువ సైతం మే నెలలో 5 శాతం క్షీణించి రూ. 48.23 లక్షల కోట్లకు చేరింది. ఏప్రిల్‌ చివరికల్లా ఈ విలువ రూ. 50.74 లక్షల కోట్లను తాకింది. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ. 40వేల కోట్లు, రుణ మార్కెట్ల నుంచి రూ. 5,505 కోట్ల పెట్టుబడులు వాపస్‌ తీసుకోవడం గమనార్హం! 

మరిన్ని వార్తలు