రియల్టీలోకి తగ్గిన పెట్టుబడులు!

25 May, 2022 21:32 IST|Sakshi

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమలోకి ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల రాక మార్చి త్రైమాసికంలో గణనీయంగా తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 62 శాతం తక్కువగా 1.18 బిలియన్‌ డాలర్ల (రూ.9,086 కోట్లు) పెట్టుబడులు వచ్చినట్టు రియల్‌ ఎస్టేట్‌ రంగ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. 

2021 మొదటి మూడు నెలల్లో రియల్టీకి వచ్చిన పీఈ పెట్టుబడులు రూ.3.08 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనించాలి. కార్యాలయం విభాగంలో పీఈ పెట్టుబడులు 732 మిలియన్‌ డాలర్లకు తగ్గాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కార్యాలయ విభాగంలోకి 2,148 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. నివాస విభాగంలోకి వచ్చిన పీఈ పెట్టుబడులు 234 మిలియన్‌ డాలర్ల నుంచి 73 మిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 

రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌లోకి వచ్చిన పీఈ పెట్టుబడులు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 484 మిలియన్‌ డాలర్ల నుంచి 253 మిలియన్‌ డాలర్లకు క్షీణించాయి. 2021 పూర్తి ఏడాదికి రియల్టీలోకి వచ్చిన పీఈ పెట్టుబడులు 6,199 మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్‌ నివేదిక వెల్లడించింది.   
 

మరిన్ని వార్తలు