గోల్డ్‌ పెట్టుబడులపై తగ్గని ఆదరణ

12 Mar, 2021 14:35 IST|Sakshi

ఆకర్షిస్తున్న కనిష్ట ధరలు 

మధ్య కాలానికి సానుకూలమేనన్న విశ్లేషణ

న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌(గోల్డ్‌ ఈటీఎఫ్‌ల)లో పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఆసక్తిగానే ఉన్నారు. ఫిబ్రవరి నెలలో రూ.491 కోట్ల మేర గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు రావడం దీన్నే సూచిస్తోంది. ముఖ్యంగా ఇటీవలి చారిత్రక గరిష్ట స్థాయిల నుంచి బంగారం ధరలు 15 శాతానికి పైనే తగ్గాయి. ఇది కూడా ఇన్వెస్టర్లను మరింత ఆకర్షించి ఉండొచ్చు. కాకపోతే ఈ ఏడాది జనవరి నెలలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా రూ.625 కోట్ల మేర పెట్టుబడులు రాగా.. ఫిబ్రవరిలో ఈ వేగం తగ్గింది. 2020 డిసెంబర్‌ నెలలోనూ ఈ సాధనాల్లోకి రూ.431 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక అంతకుముందు కాలంలో 2020 నవంబర్‌లో రూ.141 కోట్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం. 2020 సంవత్సరం మొత్తం మీద గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో రూ.6,657 కోట్ల మేర ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం గమనార్హం. మార్చి, నవంబర్‌ మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ నికరంగా పెట్టుబడులు వచ్చాయి.  

తక్కువ ధరల సానుకూలత 
‘‘2021లో ఇప్పటి వరకు బంగారం ధరలు 9 శాతం తగ్గాయి. ధరలు తగ్గినందున ఇన్వెస్టర్లు పరిణతితో తమ పోర్ట్‌ఫోలియోకు అదనంగా జోడిస్తున్నారు’’ అని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ చిరాగ్‌ మెహతా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి బలపడడం వల్ల దేశీయంగా కనిష్ట ధరలను ఇన్వెస్టర్లు అవకాశంగా తీసుకుంటున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. స్థూల ఆర్థిక బలహీన పరిస్థితులు, కనిష్ట వడ్డీ రేట్లు, ద్రవ్యపరమైన విస్తరణ, అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే బంగారంలో పెట్టుబడులు మధ్య కాలానికి అనుకూలమేనన్నారు.

చదవండి:

ఎల్ఈడీ టీవీల రేట్లకు రెక్కలు

సింగిల్ ఛార్జ్ తో 240 కి.మీ ప్రయాణం

మరిన్ని వార్తలు