కాసులు కురిపిస్తున్న ఐటీ స్టాక్స్‌ ?

5 Oct, 2021 08:53 IST|Sakshi

ఎఫ్‌పీఐల దన్నుతో ఐటీ స్టాక్స్‌ ఖుషీ

స్వల్ప, మధ్యకాలంలో మరింత స్పీడ్‌ 

మార్కెట్‌ నిపుణుల తాజా అంచనాలు 

బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్‌లో అమ్మకాలు 

ముంబై: ఈ ఏడాది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)ను ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) సర్వీసుల రంగం అత్యధికంగా ఆకట్టుకుంటోంది. దీంతో సాఫ్ట్‌వేర్‌ రంగ కంపెనీలలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్ట్‌ చివరికల్లా ఎఫ్‌పీఐ పెట్టుబడులు 1.3 శాతం పెరిగి 14.67 శాతానికి చేరాయి. ఇదే సమయంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగంలో అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నిజానికి ఈ రంగంలోని స్టాక్స్‌లో ఎఫ్‌పీఐలు సంప్రదాయంగా ఇన్వెస్ట్‌ చేసే సంగతి తెలిసిందే. అయితే జులైనెలాఖరుకల్లా ఈ రంగంలోని బ్యాంకులు, కంపెనీలలో పెట్టుబడులు 3.05 శాతంపైగా క్షీణించి 31.8 శాతానికి పరిమితమయ్యాయి. ప్రయివేట్‌ రంగ సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ ఆల్టర్నేటివ్‌ రీసెర్చ్‌ రూపొందించిన గణాంకాలివి. 
సాఫ్ట్‌వేర్‌ జోరు 
ఎఫ్‌పీఐల ఆసక్తి నేపథ్యంలో ఐటీ రంగం జోరు చూపుతోంది. స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ.. ఐటీ ఇండెక్స్‌ ఈ ఏడాది ఆగస్ట్‌వరకూ 45 శాతం జంప్‌చేసింది. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్స్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 22 శాతమే పుంజుకోవడం గమనార్హం! గత రెండు నెలలుగా ఐటీ రంగ స్పీడ్‌ బుల్‌ ఆపరేటర్లకుసైతం గందరగోళాన్ని సృష్టిస్తున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐటీ స్టాక్స్‌ అత్యంత ఖరీదుగా ట్రేడవుతున్నట్లు జేఎం ఫైనాన్షియల్‌ నిపుణులు మానిక్‌ తనేజా, కేజీ విష్ణు తెలియజేశారు. కొన్ని కంపెనీల షేర్లు ఐదేళ్ల గరిష్టాలను సైతం దాటి అంటే ప్లస్‌–3 స్టాండర్డ్‌ డీవియేషన్‌లో కదులుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రధానంగా కోవిడ్‌–19 తదుపరి ఐటీ సేవలపై వ్యయాలు పెరగడం కారణమవుతున్నట్లు వివరించారు. ఇది సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. 
2004–07లో.. 
సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల రంగం 2004–07 మధ్య కాలంలో నమోదైన బుల్లిష్‌ దశలో ప్రవేశిస్తున్నట్లు మానిక్, విష్ణు అభిప్రాయపడ్డారు. అమ్మకాల పరిమాణం, ధరలపై అజమాయిషీ చేయగల సామర్థ్యం, సరఫరాలో సవాళ్లున్నప్పటికీ మార్జిన్లను నిలుపుకోగలగడం వంటి అంశాలు సానుకూలతను కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ఐటీ రంగం అధిక వృద్ధి బాటలో సాగనున్నట్లు అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసిక (జులై–సెప్టెంబర్‌) ఫలితాలు స్వల్ప, మధ్యకాలంలో ఈ ట్రెండ్‌ కొనసాగవచ్చన్న అంశాన్ని స్పష్టం చేయగలవని వివరించారు. కాగా.. ఈ ఏడాది ఐటీ రంగ లాభాలు సగటున 20 శాతం పుంజుకోగలవని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బాటలో వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లోనూ 18 శాతం వృద్ధి నమోదుకాగలదని ఊహిస్తున్నాయి. 
అంచనాలు ఓకే 
సాఫ్ట్‌వేర్‌ రంగ కంపెనీలు ఈ ఏడాది అంచనాలను అందుకునే వీలున్నట్లు విదేశీ బ్రోకరేజీ జెఫరీస్‌ ఇటీవల నిర్వహించిన ఐటీ సదస్సులో పేర్కొంది. ఐటీ రంగంలో నెలకొన్న సానుకూల పరిస్థితులు ఇందుకు సహకరించగలవని విశ్లేషించింది. డిమాండ్‌ బలంగా ఉన్నట్లు తెలియజేసింది. దీంతో రానున్న మూడు నుంచి ఐదేళ్ల కాలంలో అన్ని సాఫ్ట్‌వేర్‌ రంగ కంపెనీలూ మెరుగైన ఫలితాలను సాధించే వీలున్నట్లు అభిప్రాయపడింది. డీల్‌ పైప్‌లైన్‌ చరిత్రాత్మక గరిష్టాలకు చేరువలో ఉన్నట్లు తెలియజేసింది. ఇందుకు ప్రధానంగా మధ్యస్థాయి డీల్స్‌ దోహదపడుతున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాదిలో మెగా డీల్స్‌ జోరందుకోగలవని అంచనా వేసింది. అయితే వచ్చే రెండు మూడు క్వార్టర్లలో పలు కంపెనీలు సరఫరా సమస్యలను ఎదుర్కొనే వీలున్నట్లు అభిప్రాయపడింది. దీంతో మార్జిన్లపై ఒత్తిడి కనిపించవచ్చని తెలియజేసింది. 
ఆరు కారణాలు 
దేశీ ఐటీ రంగం జోష్‌ కొనసాగనున్నట్లు గత వారం ఫిలిప్‌ క్యాపిటల్‌ పేర్కొంది. ఇందుకు ఆరు కారణాలను ప్రస్తావించింది. ఐటీ రీసెర్చ్‌ సంస్థ గార్ట్‌నర్‌ వేసిన సానుకూల అంచనాలు, గ్లోబల్‌ మార్కెట్లలో బలపడనున్న వాటా, పటిష్ట డీల్‌ పైప్‌లైన్, ధరలపై పట్టు, యూరోపియన్‌ మార్కెట్లలో పెరుగుతున్న అవకాశాలు, మానవ వనరుల లభ్యతను పేర్కొంది. ఇలాంటి పలు సానుకూల అంశాలతో దేశీ ఐటీ రంగ మూలాలు పటిష్టంగా ఉన్నట్లు తెలియజేసింది. ఇందువల్లనే గత ఏడాది కాలంలో ఐటీ రంగ రేటింగ్‌ మెరుగుపడినట్లు వివరించింది. వెరసి సమీప భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగంలో నెలకొన్న జోష్‌ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది. 
ఐటీ స్టాక్స్‌ జోరు(షేర్ల ధరలు రూ.లలో)
కంపెనీ పేరు        జనవరిలో    ప్రస్తుతం
ఇన్ఫోసిస్‌             1,240         1,679
విప్రో                    418            640
టెక్‌మహీంద్రా      962            1,399
హెచ్‌సీఎల్‌ టెక్‌   915             1,279
మైండ్‌ట్రీ            1,643          4,252
కోఫోర్జ్‌                 2,398          5,336
ఎల్‌అండ్‌టీ ఇన్ఫో 3,960       5,731
ఎల్‌అండ్‌టీ టెక్‌    2,429        4,627 

చదవండి : మళ్లీ లాభాల్లోకి మార్కెట్‌

మరిన్ని వార్తలు