పెరిగిన ఇన్వెస్టర్ల సంపద! 3రోజుల్లో..రూ.10.19 లక్షల కోట్లు!

31 May, 2022 08:21 IST|Sakshi

ముంబై: జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో స్టాక్‌ సూచీలు సోమవారం నెలరోజుల గరిష్టం వద్ద ముగిశాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ 1,041 పాయింట్లు బలపడి 55,925 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 309 పాయింట్లు పెరిగి 16,661 వద్ద నిలిచింది. సూచీలకిది మూడోరోజూ లాభాల ముగింపు. సెన్సెక్స్‌ 30 షేర్లలో 4 షేర్లు.., నిఫ్టీ 50 షేర్లలో 5 షేర్లు మాత్రమే నష్టపోయాయి. ఐటీ, ఇంధన షేర్లకు భారీగా డిమాండ్‌ నెలకొంది.  విస్తృతస్థాయి మార్కె ట్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు రెండుశాతానికి పైగా లాభపడ్డాయి. చాలా ట్రేడింగ్‌ సెషన్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎఫ్‌ఐఐలు 502 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.1524 కోట్ల షేర్లను కొన్నారు.

ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు 
మెరుగైన కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలకు తోడు ఆశించిన స్థాయిలో స్థూల గణాంకాల నమోదుతో అమెరికా స్టాక్‌ మార్కెట్ల ఏడు వారాల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. గత వారంలో ఎస్‌అండ్‌పీ ఆరున్నర శాతం, నాస్‌డాక్‌ 2% ర్యాలీ చేశాయి. ఆర్థిక అగ్రరాజ్యం యూఎస్‌ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చాయి. సోమవారం ఆసియా మార్కెట్లు రెండుశాతం, యూరప్‌ మార్కెట్లు ఒకశాతం బలపడ్డాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులను అనుసరిస్తున్న దేశీయ మార్కెట్‌కు ఈ అంశం కలిసొచ్చింది  

చైనాలో ఆంక్షల సడలింపు 
కరోనా కేసులు తగ్గముఖం పట్టడంతో చైనాలో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తున్నారు. దీంతో బీజింగ్, షాంఘైలో అన్నిర కార్యకలాపాల నిర్వహణ వీలు కలిగింది. అలాగే లాక్‌డౌన్‌ ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు అక్కడి ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది.  

అధిక వెయిటేజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు  
ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్లు 4.50% – ఒకటిన్నర శాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్‌ ఆర్జించిన పాయింట్లలో ఈ 5 షేర్ల వాటా 650 పాయిం ట్లు కావడం విశేషం. కనిష్టస్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో పాటు ఇటీవల రూపాయి పతనంతో ఐటీ షేర్లకు భారీ డిమాండ్‌ లభించింది.  

3రోజులే, రూ.10.19 లక్షల కోట్లు   
గడిచిన మూడురోజుల్లో సెన్సెక్స్‌ 2,176  పాయింట్లు బలపడటంతో బీఎస్‌ఈలో రూ.10.19 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ.258.47 లక్షల కోట్లకు చేరింది. సోమవారం ఒక్కరోజే రూ.5.29 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సొంతమైంది.

మరిన్ని వార్తలు