5 రోజులు.. 15 లక్షల కోట్లు!

26 Oct, 2023 04:39 IST|Sakshi

మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

సెన్సెక్స్‌ మరో 523 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్లు తగ్గుదల

ముంబై: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దేశీయంగా కీలక సూచీల పతనం కొనసాగుతోంది. స్టాక్స్‌ అధిక వేల్యుయేషన్స్‌తో ట్రేడవుతుండటం కూడా దీనికి తోడు కావడంతో బుధవారం మార్కెట్లు మరింత క్షీణించి, ఇన్వెస్టర్ల సంపద ఇంకాస్త కరిగిపోయింది. మొత్తంమీద అయిదు రోజుల్లో రూ. 14.60 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. బుధవారం సెన్సెక్స్‌ మరో 523 పాయింట్లు తగ్గి 64,049 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు క్షీణించి 19,122 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

గత అయిదు సెషన్లలో సెన్సెక్స్‌ 2,379 పాయింట్లు, నిఫ్టీ 690 పాయింట్లు పతనమయ్యాయి. బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 309,22,136 కోట్లకు తగ్గింది. ‘అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లు వరుసగా అయిదో సెషన్లోనూ క్షీణించాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్‌ దీనికి సారథ్యం వహించాయి.

దేశీ స్టాక్స్‌ అధిక వేల్యుయేషన్స్‌లో ట్రేడవుతుండటం, అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొనడం తదితర పరిణామాల కారణంగా ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో తమ పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు‘ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ విభాగం (రిటైల్‌) హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలిపారు. లాభాల స్వీకరణ కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లకు తగిన పరిస్థితులు ఏర్పడటంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నట్లు ఈక్విట్రీ సహ వ్యవస్థాపకుడు పవన్‌ భరాదియా వివరించారు.  

ఇన్ఫీ 3 శాతం డౌన్‌..
సెన్సెక్స్‌లో ఇన్ఫీ షేర్లు అత్యధికంగా 2.76 శాతం మేర క్షీణించాయి. భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్‌ మొదలైనవి కూడా నష్టపోయాయి. టాటా స్టీల్, ఎస్‌బీఐ మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ తదితర స్టాక్స్‌ లాభపడ్డాయి. టెక్‌ సూచీ 1.39 శాతం, టెలికం 1.29 శాతం, యుటిలిటీస్‌ 1.25 శాతం మేర క్షీణించగా మెటల్స్‌ సూచీ మాత్రమే లాభపడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ. 4,237 కోట్లు విక్రయించగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ. 3,569 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు. అటు అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్‌ లాభపడగా, సియోల్‌ సూచీలు నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు నెగటివ్‌లో ట్రేడయ్యాయి. 

మరిన్ని వార్తలు