మోటో వ్లాగర్‌లకు శుభవార్త..ఐఓసీ అదిరిపోయే బిజినెస్ ఐడియా!

19 Jul, 2022 08:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంధన రిటైలింగ్‌లో పోటీ తీవ్రమవుతుండటంతో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హిమాలయాలకు బైక్‌లపై సాహసయాత్రలు చేసే పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బైకర్స్‌ కేఫ్‌లను ఏర్పాటు చేస్తోంది.

 సిమ్లాలో తొలి కేఫ్‌ను ప్రారంభించామని, త్వరలో చండీగఢ్‌–మనాలీ రూట్‌లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. సిమ్లా శివార్లలోని షోగి దగ్గర్లో ఒక పెట్రోల్‌ బంకులో ఖాళీ స్థలం ఉండటంతో దాన్ని బైకర్స్‌ కేఫ్‌గా మార్చినట్లు పేర్కొన్నారు.

 ఇందులో వైఫైతో పాటు బైకర్లు విశ్రాంతి తీసుకునేందుకు, మోటర్‌సైకిళ్లను పార్కింగ్‌ చేసుకునేందుకు, చిన్నపాటి రిపేర్లు మొదలైన వాటికోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అలాగే, లిప్‌ గార్డ్, సన్‌స్క్రీన్‌ లోషన్, గ్లవ్స్, రెయిన్‌ కోట్‌లు, టార్పాలిన్‌ మొదలైన వాటిని కూడా విక్రయిస్తున్నట్లు అధికారి పేర్కొన్నారు. సాధారణంగా బైకర్ల యాత్రలు ఢిల్లీ నుంచి లడఖ్‌ వరకూ వివిధ మార్గాల్లో ఏటా జూన్‌ తొలి వారంలో మొదలై అక్టోబర్‌ ప్రథమార్ధం వరకూ కొనసాగుతుంటాయి.

మరిన్ని వార్తలు