భారత్‌లో ఐఫోన్‌ 12 తయారీ: 10 వేల ఉద్యోగాలు!

22 Aug, 2020 16:59 IST|Sakshi

బెంగళూరు ప్లాంటులో 10 వేల ఉద్యోగాలు!

బెంగళూరు: ఆపిల్‌ ఐఫోన్‌ ప్రియులకు శుభవార్త. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి మేడిన్‌ ఇండియా ఐఫోన్‌ 12 అందుబాటులోకి రానుందని బిజినెస్‌ స్టాండర్డ్‌ నివేదించింది. ఇందుకు సంబంధించిన ఉత్పత్తి ప్రక్రియను తైవాన్‌కు చెందిన విస్ట్రాన్‌ కంపెనీ ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించింది. కర్ణాటకలోని కోలార్‌ జిల్లా నరసాపురలో గల ప్లాంటులో ఈ మేరకు ఐఫోన్‌ 12 కాంపోనెట్స్‌ ఉత్పత్తి మొదలైందని పేర్కొంది. ఈ నేపథ్యంలో విస్ట్రాన్‌ కంపెనీ దశల వారీగా దాదాపు 10 వేల మంది ఉద్యోగాలు కల్పించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఇప్పటికే 2 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడిచింది. (స్మార్ట్‌ఫోన్‌ : శాంసంగ్ భారీ ప్రణాళికలు)

ఇందుకు సంబంధించి డిప్లొమా గ్రాడ్యుయేట్లకు వాక్-ఇన్‌‌ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని, అనుభవజ్ఞులతో పాటు ఫ్రెషర్స్‌కు కూడా త్వరలోనే మరిన్ని అవకాశాలు రానున్నాయని పేర్కొంది. ఇక ప్రస్తుతం ఐఫోన్‌ 12 కాంపొనెట్స్‌ ట్రయల్‌ ప్రొడక్షన్‌ చేపట్టిన విస్ట్రాన్‌ సెప్టెంబరు నుంచి కమర్షియల్‌ ఉత్పత్తిని ప్రారంభించనుంది. కాగా టెక్‌ ప్రియుల్లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఐఫోన్‌ను స్థానికంగా ఉత్పత్తి చేయడం ద్వారా 22 శాతం మేర దిగుమతి పన్నులు తగ్గడంతో పాటుగా స్థానికులకు కొత్త ఉద్యోగవకాశాలు కూడా లభిస్తున్నాయి. (భారత్‌లో ఐఫోన్‌ 11 తయారీ)

ఇక భారత్‌లో ఇప్పటికే ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌7, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ 11లను ఉత్పత్తి చేసిన ఆపిల్‌.. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా ఐఫోన్‌ 12 స్థానిక తయారీకి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. కాగా 2017లో ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ బెంగళూరుకు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోలార్‌లో నెలకొల్పిన ఆపిల్‌ ప్లాంటులో అసెంబ్లింగ్‌ ప్రక్రియను విస్ట్రాన్‌ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఇక విస్ట్రాన్‌ ప్రత్యర్థి కంపెనీ ఫాక్స్‌కాన్‌ తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్ 11ను చెన్నైలోని ప్లాంట్లో తయారు చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు