ఐఫోన్‌ 13లో సరికొత్త ఆప్షన్‌.. ఆపదలో ఆదుకునేలా!

7 Sep, 2021 10:42 IST|Sakshi

సరికొత్త ఫీచర్లతో టెక్‌ యూజర్లను ఆకట్టునేలా ఫోన్లను తీసుకువచ్చే యాపిల్‌ కంపెనీ ఈ సారి మరో కొత్త ఆప్షన్‌తో ముందుకు రానుంది. ఈ నెలాఖరుకల్లా మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్న ఐ ఫోన్‌ 13ని ఆపదలో ఆదుకునే పరికరంగా కూడా ఉపయోగపడేలా డిజైన్‌ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఎమర్జెన్సీ ఎస్సెమ్మెస్‌
యాపిల్‌ సంస్థ నుంచి త్వరలో మార్కెట్‌కి రాబోతున్న ఐఫోన్‌ 13లో ఎమర్జెన్సీ ఎస్‌ఎమ్మెస్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. మారుమూల ప్రాంతాలు, రిమోట్‌ ఏరియాలు, దట్టమైన అడవులు, సముద్ర ప్రయాణాలు చేసే సమయంలో నెట్‌వర్క్‌ పని చేయని సందర్భంలో ఇతరులతో కమ్యూనికేట్‌ అయ్యేలా ఈ ఫీచర్‌ పని చేస్తుందని బ్లూమ్‌బర్గ్‌ టెక్‌ నిపుణుడు మార్క్‌ గుర్‌మన్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో అత్యవసర సమయంలో ఎస్‌వోఎస్‌ మేసేజ్‌లు చేసే వీలున్నా ఇవన్నీ పరిమితంగానే పని చేస్తాయి. యాపిల్‌ అందించే ఎమర్జెన్సీ ఫీచర్‌లో తమ చుట్టు ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఎస్‌ఎమ్మెస్‌లను పంపే వీలుంటుంది. దీని వల్ల ఎమర్జెన్సీ మెసేజ్‌ రిసీవ్‌ చేసుకున్న వారు మరింత మెరుగ్గా స్పందించే వీలు కలుగుతుంది.

లియో ఆధారంగా
ఇంటర్నెట్‌, మొబైల్‌ నెట్‌వర్క్‌ రంగంలో భవిష్యత్తు టెక్నాలజీగా చెబుతున్న లో ఎర్త్‌ ఆర్బిన్‌, లియో (LEO) ఆధారంగా ఈ ఎమర్జెన్సీ మెస్సేజ్‌ పని చేస్తుందని చెబుతున్నారు. మొబైల్‌ నెట్‌వర్క్‌ పని చేయని చోట తక్కువ ఎత్తులో ఉండే శాటిలైట్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఫోన్‌ను ఉపయోగించుకునే వీలు ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ పరిమితంగా కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉంది. అక్కడ మాత్రమే ఈ ఎమర్జెన్సీ ఎస్‌ఎమ్మెస్‌ ఫీచర్‌ పని చేస్తుంది. ప్రస్తుతం అనేక సంస్థలు లియో టెక్నాలజీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నాయి. ఇండియాలో టాటా , ఎయిర్‌టెల్‌ సంస్థలు లియో టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాయి.

ఆ ఫీచర్‌ ఇప్పుడే కాదు
ఐ ఫోన్‌ 13 లియో టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుందని, మొబైల్‌ నెట్‌వర్క్‌తో పని లేకుండానే కాల్స్‌, మేసేజ్‌ చేసుకోవచ్చనే వార్తలు మొదటగా వచ్చాయి. అయితే లియో టెక్నాలజీ ఆధారంగా ఫోన్లు తయారు చేసేందుకు అవసరమైన హార్డ్‌వేర్‌ ఇంకా భారీ స్థాయిలో అందుబాటులోకి రాలేదు, పైగా అన్ని దేశాల్లోనూ లియో టెక్నాలజీ కమర్షియల్‌ స్థాయిని అందుకోలేదు. దీంతో లియో టెక్నాలజీని తెచ్చేందుకు సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

యాపిల్‌ సొంతంగా 
టెక్నాలజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసే యాపిల్‌ సంస్థ లియో పైనా కన్నేసింది. అయితే ఇతర సంస్థలకు చెందిన శాటిలైట్‌లను ఉపయోగించుకోవడానికి బదులుగా తానే స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అంటున్నారు. అందువల్లే ఐఫోన్‌ 13లో లియో టెక్నాలజీ వాడలేదని చెబుతున్నారను. కానీ యాపిల్‌ సంస్థ ఇంటర్నల్‌ మార్కెట్‌ స్ట్రాటజీ ప్రకారం లియో ఆపరేషన్స్‌ సొంతంగా చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

చదవండి: టెక్ దిగ్గజం ఆపిల్‌ను దాటేసిన షియోమీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు