కొత్త ఉద్యోగాలు, దిగి రానున్న ఐఫోన్‌ ధరలు: యాపిల్‌ బిగ్‌ ప్లాన్స్‌

9 Jan, 2023 17:33 IST|Sakshi

టెక్‌ దిగ్గజం, ఇండియాలో  టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, యాపిల్‌ భారత్‌లో తన దూకుడును మరింత పెంచుతోంది. త్వరలోనే ఇండియాలోనే సొంతంగా రెండు రీటైల్‌ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. భారత్‌లో ఐఫోన్‌లకు డిమాండ్‌ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రెండు ప్రధాన నగరాల్లో  సొంతంగా రీటైల్‌ స్టోర్లను తెరిచేందుకు సన్నద్ధమవుతోంది.

ఢిల్లీలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ ఏర్పాటు కానుండగా, ముంబైలో దాదాపు దీనికి రెట్టింపు సైజులో 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ రానుందని పలు నివేదికల సమాచారం.  కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇండియాలో యాపిల్‌ స్టోర్ల  లాంచింగ్‌ ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలో ముంబై, న్యూఢిల్లీలో ఏర్పాటు చేయనుంది. ముందుగా  ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో తొలి స్టోర్‌ తెరుచుకోనుంది.

అంతేకాదు ఈ స్టోర్లలో పనిచేసేందుకు ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే  ఐదుగురు ఉద్యోగులకు ఎంపిక చేసిన యాపిల్‌ ఇండియా సోషల్ మీడియా నెట్‌వర్క్  లింక్డ్‌ఇన్‌లో తమ నియామక ప్రకటనలు ఓపెనింగ్స్ వివరాలను ప్రచురించడం విశేషం. యాపిల్ రిటైల్‌లో 12 కొత్త ఉద్యోగ అవకాశాలుండగా, ఇందులో స్టోర్‌ లీడర్‌లు, మార్కెట్ లీడర్‌లు, మేనేజర్‌లు, సీనియర్ మేనేజర్‌ స్థాయి (ఫుల్‌ టైం, పార్ట్-టైమ్)  జాబ్స్‌ ఉన్నాయి. 

భారతదేశంలో తన రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయడమే కాకుండా, యాపిల్ స్థానికంగా ఐఫోన్‌ల తయారీ , అసెంబ్లింగ్‌ను కూడా ప్రారంభించింది. గత ఐదేళ్లుగా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2017లో యాపిల్ తొలిసారిగా భారతదేశంలో ఐఫోన్‌లను (ఐఫోన్ SE) అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. సెప్టెంబర్ 2022లో, కంపెనీ ఐఫోన్ 14 మోడల్‌ల ఉత్పత్తిని చైనా నుండి భారతదేశానికి మార్చింది. తన గ్లోబల్ పార్ట్‌నర్ ఫాక్స్‌కాన్ ప్రస్తుతం ఈ ఫోన్‌ను చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం, ఇతర కారణాల రీత్యా భారత్ త్వరలో చైనా, వియత్నాంలను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కేంద్రంగా అవతరించనుందని అంచనా.

దీంతో ఐఫోన్‌ ధరలు దిగి రానున్నాయని అటు విశ్లేషకులు, ఇటు ఐఫోన్‌ లవర్స్‌ అంచనా.  ముఖ‍్యంగా  ఇతర  దేశాలతో పోలిస్తే మన దేశంలో ఐఫోన్‌లపై 22 శాతం కస్టమ్స్ సుంకం,  18శాతం జీఎస్‌టీతో  భారతదేశంలో  ఐఫోన్లు  ఖరీదే. ఉదాహరణకు, ఐఫోన్ 14 ప్రో  బేస్ ధర దేశంలో కేవలం రూ.90,233. అయితే, కస్టమ్స్ సుంకం,  జీఎస్‌టీ కలిపి మొత్తం ధర   రూ. 129,900 అవుతోంది.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు