ఐఫోన్‌ యూజర్లు జాగ్రత్త... ప్రభుత్వ హెచ్చరిక!

18 Feb, 2023 11:34 IST|Sakshi

యాపిల్‌ ఐఫోన్లు ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన స్మార్ట్‌ఫోన్లు. చాలా మందికి ఇవంటే మోజు. డిజైన్‌, ఇతరత్రా ఫీచర్ల కోసం వీటిని ఇష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తున్న తమ ఫోన్ల భద్రత విషయంలో ఆపిల్‌ సంస్థ ఎప్పటికప్పడు నూతన ఐఓఎస్‌ వర్షన్లను విడుదల చేస్తూనే ఉంటుంది. వాటిని వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని యూజర్లకు సూచిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది కొత్త వర్షన్లను అప్‌డేట్‌ చేయకుండా పాత వర్షన్లనే వినియోగిస్తుంటారు. అలాంటి వారిని భారత ప్రభుత్వం హెచ్చరించింది. పాత వర్షన్లు సురక్షితం కాదని, హ్యాకర్లు సులువుగా వాటిని హ్యాక్‌ చేస్తున్నారని గుర్తించిన మీదట ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది.

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అందించిన నివేదిక ప్రకారం.. ఐఓఎస్‌లో హ్యాకింగ్‌కు అనేక ఆస్కారాలు ఉన్నాయి. యూజర్ల సున్నితమైన సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. 16.3.1, అంతకు ముందుటి వర్షన్లతో ఉన్న ఐఫోన్‌8 లేదా ఆ తర్వాత వచ్చినవి, ఐపాడ్‌ ప్రో అన్ని మోడళ్లు, ఐపాడ్‌ ఎయిర్‌ థర్డ్‌ జనరేషన్‌, ఆ తర్వాతవి, ఐపాడ్‌ ఎయిర్‌ ఫిఫ్త్‌ జనరేషన్‌, ఆ తర్వాతివి, ఐపాడ్‌ మినీ ఫిఫ్త్‌ జనరేషన్‌, ఆతర్వాతి వాటిపై హ్యాకర్ల ప్రభావం ఉంటుందోని పేర్కొంది.

శాంసంగ్‌ గెలాక్సీ యూజర్లు కూడా..
అలాగే శాంసంగ్‌ గెలాక్సీ వినియోగదారులకు కూడా భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. శాంసంగ్‌ కూడా తమ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త వర్షన్లను సూచిస్తూనే ఉంటుంది. అయితే పాత వర్షన్లకు అలవాటు పడిన వినియోగదారులు వాటిని అలాగే కొనసాగిస్తుంటారు. అలాంటి జాగ్రత్త పడాలి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వచ్చే శాంసంగ్‌ గెలాక్సీ స్టోర్‌ యాప్‌లో హ్యాకింగ్‌ ప్రమాద ఆస్కారాన్ని గుర్తించినట్లు CERT-In పేర్కొంది. 4.5.49.8కి ముందుటి శాంసంగ్‌ గెలాక్సీ స్టోర్‌ యాప్ వెర్షన్‌తో ఫోన్లను ఇది ప్రభావితం చేస్తుంది.

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌
అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లలోనూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హ్యాకింగ్‌ ప్రమాదాన్ని గుర్తించింది. 109.0.1518.78కి ముందున్న ఎడ్జ్ బ్రౌజర్ వెర్షన్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఇది టార్గెటెడ్ సిస్టమ్‌లో డినైల్‌ ఆఫ్‌ సర్వీస్‌ (DoS) ఆప్షన్లను సైతం మార్చగలిగే అవకాశాన్ని హ్యాకర్‌రకు ఇస్తుంది.

మరిన్ని వార్తలు