ఐపీఎల్‌ 2023: అంబానీ పవర్‌ ప్లే: ఫ్రీ స్ట్రీమింగ్!

22 Feb, 2023 16:41 IST|Sakshi

సాక్షి,ముంబై: ఐపీఎల్‌ 2023 సందర్భంగా బిలియనీర్‌ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అదిరి పోయే ప్లాన్‌ వేశారు.  క్రికెట్‌ క్రేజ్‌ను క్యాష్‌చేసుకునేలా రిలయన్స్‌ సొంతమైన వయోకామ్‌ 18  మీడియా ద్వారా ప్రధాన ప్రత్యర్థులను ఢీకొట్టి మరీ  ఈ బిడ్డింగ్‌ను గెల్చుకోవడమే కాదు ఇపుడిక  ఉచితంగా  ప్రసారాలను అందించనున్నారు.

ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని వయాకామ్ 18  దాదాపు రూ. 23,758 కోట్లతో  ఐపీఎల్‌ 20223 రైట్స్‌ గెల్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా భారతదేశపు అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని ఉచితంగా ప్రసారం చేయనుందని తెలుస్తోంది. ఫిఫా వరల్డ్‌ కప్‌ తరువాత 16వ ఐపీఎల్‌ లీగ్‌ ప్రసార హక్కులు దక్కించుకోవడం ఒక ఎత్తయితే ఉచితంగా అందించాలని భావించడం మరో ఎత్తు.  డిస్నీ హాట్‌స్టార్ , అమెజాన్ ప్రైమ్ వంటి ప్రత్యర్థులను ఢీకొట్టి  వయాకామ్ 18 స్ట్రీమింగ్ హక్కులను పొందడం ఇదే మొదటిసారి. డిస్నీ హాట్‌స్టార్ గత ఐదు సంవత్సరాలుగా ప్రసార హక్కులను కలిగి ఉంది.  దీంతో  అటు జియో 5జీ సేవ విస్తరణతో పాటు, పోటీ   సంస్థలకు  దెబ్బ అదిరిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వయాకామ్ 18 ఐపీఎల్‌ టోర్నమెంట్‌ను దాని రెండు OTT ప్లాట్‌ఫారమ్‌లు, వూట్‌,  జియో సినిమా, ఒక TV ఛానెల్ ద్వారా ఉచితంగా ప్రసారం చేయాలని భావిస్తోందట. అదీ 4కే రిజల్యూషన్‌తో అందించనుందని తెలుస్తోంది. ఖతర్‌ ఫిఫా వరల్డ్ కప్-2022ను ఉచిత ప్రసారాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఐపీఎల్‌ను మాత్రం 4కే రిజల్యూషన్‌తో 12 భారతీయ భాషల్లో ఉచితంగా అందించాలని నిర్ణయించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ సహా పలు భాషల్లో కామెంటరీ  ఇస్తుందట.

మరోవైపు ఈ ఐపీఎల్‌ను 550 మిలియన్ల కుపైగా  మంది ప్రేక్షకులు  చూస్తారని  వయోకామ్‌ అంచనా వేస్తోంది. అయితే వయాకామ్ 18 మీడియా సీఈఓ (స్పోర్ట్స్), అనిల్ జయరాజ్ వ్యాఖ్యల్ని బట్టి ఐపీఎల్‌ మొదటి సంవత్సరం మాత్రమే జియో సినిమాలో  ఉచితంగా చూడవచ్చని కూడా భావిస్తున్నారు.  తాజా వార్తలపై వయాకామ్ 18 అధికారికంగా స్పందించాల్సి ఉంది.

కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ వయాకామ్ 18 రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (RPPMSL) యాజమాన్యంలో ఉన్న వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (Viacom18), జియో సినిమా OTT ప్లాట్‌ఫారమ్‌ల విలీనానికి గత ఏడాదే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. 
 

>
మరిన్ని వార్తలు