సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ సెట్‌ చేస్తోంది, యువత చూపంతా ఐపీవోలపైనే

25 Dec, 2021 09:19 IST|Sakshi

పేటీఎం లిస్టింగ్‌ రోజున లోయర్‌ సర్క్యూట్‌ (ఆ రోజు అనుమతించిన మేరకు గరిష్ట పతనం)ను తాకడం చాలా మంది ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు, పోస్ట్‌లతో తమ ఆందోళనను, కంగారును వ్యక్తం చేయడం చాలా మంది గమనించే ఉంటారు. ఇదే విషయమై ప్రముఖ ట్విట్టర్‌ హ్యాండిల్‌ ‘ఐపీవో మంత్ర’ నిర్వహిస్తున్న ఆర్‌కే గుప్తాకు వందలాది మెయిల్స్‌ వచ్చాయి.

‘‘దేశంలోనే పేటీఎం అతిపెద్ద ఐపీవో. కానీ, ఐపీవోను కంపెనీ సరైన విధంగా నిర్వహించలేకపోయింది. పెద్ద బ్రాండ్లు ఎప్పుడు కూడా పెద్ద రాబడులకు మార్గం కాబోవు. జాగ్రత్తగా ఉండాలని నేను ముందు నుంచే చెబుతున్నాను’’ అని గుప్తా అభిప్రాయపడ్డారు. సోషల్‌ మీడియా వేదికలు ఐపీవో చుట్టూ ఆసక్తికర వాతావరణం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విశ్లేషకులు (ఎనలిస్ట్‌లు), మార్కెట్‌ నిపుణులను లక్షలాది మంది నిత్యం, అనుక్షణం ఫాలో అవుతుండడాన్ని గమనించొచ్చు. ఆర్‌కే గుప్తాను ప్రతీ నెలా 15,000–20,000 మంది కొత్తగా అనుసరిస్తుండడం గమనార్హం.

 అయితే, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అన్నీ కూడా ఇన్వెస్టర్లను సరైన మార్గంలో నడిపిస్తాయని భావించడం పొరపాటే అవుతుంది. పాలు నుంచి నీటిని వేరు చేసినట్టు.. ఈ పోస్ట్‌ల్లో మెరుగైన వాటిని వడకట్టడం యువ ఇన్వెస్టర్లకు కష్టమైన పనే అవుతుంది. విశ్లేషకుడు లేదా మరొకరు చెప్పారనో.. ఆసక్తికర పోస్ట్‌లు చూసో.. వచ్చిన ప్రతీ ఐపీవోకు బిడ్‌ వేయడం లాభాలకు హామీనివ్వబోదన్న విషయాన్ని తెలుసుకోవాలి. 

యవతరం వన్‌సైడ్‌.. 
మార్కెట్లు గరిష్టాలకు చేరి, ఐపీవోల సందడి నేపథ్యంలో కొత్త కొత్త ఇన్వెస్టర్లు లాభాల కోసం డీమ్యాట్‌ ఖాతాలను తెరిచేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీని ఫలితమే గడిచిన ఏడాదిన్నర కాలంలో సుమారు 3 కోట్లకు పైనే కొత్త డీమ్యాట్‌ ఖాతాలు తెరుచుకున్నాయి. ఇందులో ఎక్కువ వాటా సీడీఎస్‌ఎల్‌కే వెళ్లింది. కొత్త ఇన్వెస్టర్లలో యువతరమే ఎక్కువగా ఉంది. వీరు ఎక్కువగా సోషల్‌మీడియాను అనుసరిస్తుంటారు. ఆశ్చర్యకరం ఏమిటంటే.. దేశంలో మెజారిటీ రిటైల్‌ ఇన్వెస్టర్లు కంపెనీల గురించి తగిన అధ్యయనం చేయకుండా, ఐపీవో ముసాయిదా పత్రాలను చదవకుండా పెట్టుబడులు పెడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. వీరి పెట్టుబడి నిర్ణయాల వెనుక.. బుల్‌మార్కెట్‌ యూఫోరియాకుతోడు.. జొమాటో, నైకా తదితర ప్రముఖ కంపెనీల ఐపీవోల పట్ల నెలకొన్న ప్రచారమే కారణంగా కనిపిస్తుంది.

ఇటీవలి కాలంలో చాలా కంపెనీలు లిస్టింగ్‌ రోజే అద్భుతమైన రాబడులను ఇస్తుండడం, గ్రే మార్కెట్లో ఐపీవో ఇష్యూల ధరలకు భారీ ప్రీమియం పలకడం, పెద్ద ఎత్తున సబ్‌స్క్రయిబ్‌ కావడం, సోషల్‌ మీడియాలో ఊదరగొట్టే ప్రచారం, పోస్టింగ్‌లు ఇలా అన్నింటి పాత్ర ఉంది. ఈ సంస్కృతి ఎంతగా విస్తరించిందంటే.. అనధికారికంగా వాట్సాప్, టెలిగ్రామ్‌ గ్రూపులు ఏర్పాటు చేసి మరీ ఐపీవోలకు ప్రచారం కల్పిస్తుండడం గమనించాలి. యూట్యూబ్‌ చానళ్లలోనూ కొందరు ఇదే పనిచేస్తున్నారు. ‘‘పెట్టుబడుల అవకాశాలను గుర్తించడంలో, కంపెనీలు, ఐపీవోలకు సంబంధించి ప్రచారం కల్పించడంలో షోషల్‌ మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది’’ అని నెజెన్‌ క్యాపిటల్‌ సీఈవో నీల్‌ బహల్‌ తెలిపారు.  

చికాగోకు చెందిన అన్సిడ్‌ క్యాపిటల్‌ ఫండ్‌ మేనేజర్‌ అనురాగ్‌సింగ్‌.. పేటీఎం ఐపీవోపై నవంబర్‌ 8న చేసిన ట్వీట్‌ పెద్ద వైరల్‌ అయింది. పేటీఎం ఐపీవోపై సింగ్‌ ఎన్నో ట్వీట్లు చేశారు. ‘‘సాధారణ కంపెనీ అయిన పేటీఎంను దిగ్గజాలు ఎప్పుడో అధిగమించేశాయి. యాక్సిస్‌ బ్యాంకులో 65 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 40 శాతం మార్కెట్‌ విలువను పేటీఎం ఆశిస్తోంది. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న మ్యూచువల్‌ ఫండ్‌ పథకం పేటీఎంలో పెట్టుబడులు పెడితే, వెంటనే ఆ సిప్‌ను ఆపివేసుకోండి’’ అంటూ ఇన్వెస్టర్ల కళ్లు తెరిపించే ప్రయత్నాన్ని అనురాగ్‌సింగ్‌ చేశారు. టీవీల్లో ఇప్పుడు పేటీఎంపై విశ్లేషణల్లో సింగ్‌ వ్యాఖ్యానాలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడిందనడంలో సందేహం లేదు.  

భిన్న దారులు..  
జొమాటో, పేటీఎం, నైకా, పీబీ ఫిన్‌టెక్‌ (పాలసీ బజార్‌) తదితర నూతనతరం టెక్నాలజీ ఆధారిత కంపెనీల విలువల విషయంలో మార్కెట్‌ రెండు వర్గాలుగా విడిపోయింది. కొత్తతరహా కంపెనీలను.. పాత విధానంలో పీఈ, ఇతర లాభాల రేషియోల ఆధారంగా విలువ కట్టడం సరికాదన్నది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు నష్టాలు వస్తున్నా.. కొంత కాలానికి అవి లాభాలను కురిపించే యంత్రాలుగా మారతాయని కొందరు బలంగా విశ్వసిస్తుంటారు. ‘‘పాత తరం ఇన్వెస్టర్లు టెక్నాలజీ బూమ్‌కు, క్రిప్టో, ఎన్‌ఎఫ్‌టీ బూమ్‌లకు దూరంగా ఉండిపోయారు. నైకా తదితర కొత్త కంపెనీలను వ్యాపారంలో లాభాలకు బదులు వృద్ధి రేటు ఆధారంగా పెట్టుబడులకు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ బలమైన బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకునే క్రమంలో కంపెనీ ఉంది. వీటిల్లో కొన్ని ఇప్పుడు ఖరీదుగానే కనిపిస్తున్నా.. 3–4 ఏళ్ల తర్వాత చౌకగా అనిపిస్తాయి’’ అని  నీల్‌ బహల్‌ వివరించారు.

చదవండి: ఐపీవోల హవా.. ఈ ఏడాది రూ.1.35 లక్షల కోట్లు.. వచ్చే ఏడాది?

మరిన్ని వార్తలు