కొత్త బిలియనీర్‌.. ఐపీవో ఈయన నెత్తిన పాలు పోసింది! ఏకంగా 8 వేల కోట్లకు..

26 Nov, 2021 15:24 IST|Sakshi

ఐపీవో.. ఈ పేరు వినగానే చాలామంది హడలిపోతున్నారు ఇప్పుడు.  బడా బడా కంపెనీలు, స్టార్టప్‌లు మెగా ఐపీవోలతో పబ్లిక్‌ ఇష్యూయింగ్‌కు వెళ్లడం, షేర్‌ మార్కెట్‌లో చతికిలపడి లక్షల మంది ఇన్వెస్టర్లను నిండా ముంచడం చూస్తున్నాం. ముఖ్యంగా పేటీఎం పర్యవసనాలు.. ఐపీవోకి వెళ్లాలన్న ఆలోచనల్లో ఉన్న చాలా కంపెనీలను పునరాలోచనల్లో పడేశాయనే చెప్పాలి.  ఈ తరుణంలో ఐపీవో ఆ కంపెనీ పాలిట వరంగా మారింది. 


చెన్నైకి చెందిన డేటా అనలైటిక్స్‌ కంపెనీ లాటెన్‌ వ్యూ అనలైటిక్స్‌ లిమిటెడ్‌ దలాల్‌ స్ట్రీట్ వద్ద బంపర్‌హిట్‌ సాధించింది. లాటెంట్‌ వ్యూ షేర్లు స్టాక్‌ఎక్స్ఛేంజీ లిస్టింగ్‌లో అదరగొడుతున్నాయి. ఇష్యూ ధర రూ.197 కాగా..  దీనికి 169 శాతం అధికంగా రూ.702 వద్ద బీఎస్‌ఈలో, 160 శాతం అధికంగా రూ.670 వద్ద ఎన్‌ఎస్‌ఈలో షేర్లు ట్రేడ్‌ అవుతున్నాయి. 

ఇక ఈ కంపెనీ షేర్లు 338 రెట్ల కంటే ఎక్కువగా సబ్‌స్క్రైబ్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు లాభాలతో పండుగ చేసుకుంటున్నారు. అందరి కంటే ముఖ్యంగా లాటెంట్‌ ప్రమోటర్‌ అడుగుడి విశ్వనాథన్‌ వెంకట్రామన్‌ (వెంకట్‌ విశ్వనాథన్‌) ను ఏకంగా బిలియనీర్‌ను చేసింది ఈ ఐపీవో పరిణామం. 

వెంకట్రామన్‌ లాటెంట్‌ వ్యూ అనలైటిక్స్‌కు చైర్‌పర్సన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కూడా. కంపెనీలో 117.91 కోట్ల షేర్లు ఉన్నాయి ఆయనకి. అంటే దాదాపు 69.62 శాతం వాటా ఈయనదే!. డేటా అనలైటిక్స్‌ ఐపీవో వెంకట్రామన్‌ నెత్తిన పాలుపోసింది. గురువారం క్లోజింగ్‌ ప్రైస్‌ను గనుక పరిగణనలోకి తీసుకుంటే.. ఆయన వాటా విలువ అక్షరాల 8, 275 కోట్ల రూపాయలకు చేపరింది. అంటే 1.1 బిలియన్‌ డాలర్లతో ఆయన్ని బిలియనీర్‌ లిస్ట్‌లో చేర్చిందన్నమాట. 

ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్‌, ఐఐఎం కలకత్తాలో  చదివిన వెంకట్రామన్‌.. కాగ్నిజెంట్‌ లాంటి కొన్ని టాప్‌ కంపెనీల్లో పనిచేశారు. ఐటీ సర్వీసుల్లో ఉంటూనే బిజినెస్‌ సెక్టార్‌లో మంచి అనుభవం సంపాదించారు. 2007లో లాటెంట్‌ వ్యూ అనలైటిక్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. లాటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌ లిమిటెడ్‌ LVAL.. దేశంలో డేటా అనలిటిక్స్‌ సర్వీసులను అందించే సంస్థల్లో ఒకటి. డిజిటల్‌ సొల్యూషన్స్‌తో పాటు బిజినెస్‌ అనలైటిక్స్‌-ఇన్‌సైట్స్‌, డాటా ఇంజినీరింగ్‌ సర్వీసులను అందిస్తోంది. ఆసియా దేశాలు, యూరప్‌తో పాటు అమెరికాలోని కొన్ని కంపెనీలు లాటెంట్‌ సేవల్ని వినియోగించుకుంటున్నాయి.

చదవండి: 38 వేల కోట్ల లాస్‌ అతడి వాళ్లే.. నెటిజన్ల ఫైర్‌!

మరిన్ని వార్తలు